హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి పనివాళ్ల పేర్ల పైనా మద్యం దుకాణాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు బుధవారం ఆరోపించారు. ఆయన మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బొత్స ఇంటి పనివాళ్ల పేర్ల పైనా మద్యం దుకాణాలు ఉన్నాయని, అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ప్రజా ధనం దోపిడీ చేస్తున్న మద్యం సిండికేట్లపై చర్యలు తీసుకోవాలని తాము ప్రశ్నించడం తప్పెలా అవుతుందని ఆయన అన్నారు. ఎసిబి రిమాండ్ రిపోర్టులో ఉన్న ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే మద్యం సిండికేట్లతో సంబంధమున్న మంత్రులు మోపిదేవి వెంకట రమణ, బొత్స సత్యనారాయణ, రాంరెడ్డి వెంకట రెడ్డి, ధర్మాన ప్రసాద రావులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బొత్స మద్యం డాన్ అని, ఆయనే పెద్ద అవినీతిపరుడన్నారు.
అధికారులను మాత్రమే అరెస్టు చేసి నేతలను వదలడం వెనుక ఉద్దేశ్యమేమిటని అన్నారు. ఎసిబి రిమాండ్ రిపోర్టులో మంత్రి పేరున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. బొత్స సత్యనారాయణ చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మరో నేత కొత్తకోట దయాకర రెడ్డి అన్నారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకంలో రాజకీయ కోణం ఉంది కాబట్టే చంద్రబాబు లేఖ రాశారన్నారు. బొత్స చంద్రబాబుపై విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు.