సచ్ఛీలత నిరూపించుకుంటా: రాజీనామా తర్వాత ధర్మాన

తాను కాంగ్రెసు పార్టీ సిద్ధాంతాలకు తాను కట్టుబడి ఉన్న వ్యక్తినని, వ్యక్తి ప్రతిష్ట కన్నా పార్టీ, ప్రభుత్వం గౌరవం ముఖ్యమని ఆయన అన్నారు. చార్జిషీట్ అంశాలను పరిశీలించిన తర్వాతనే రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు ఆయన తెలిపారు. సంప్రదాయానికి కట్టుబడి తాను రాజీనామా చేశానని ఆయన చెప్పారు.
రాజీనామా లేఖను సభా నాయకుడైన ముఖ్యమంత్రికి ఇస్తే చాలునని, గవర్నర్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రాజీనామా చేయాలనేది తన వ్యక్తిగత నిర్ణయమని ఆయన చెప్పారు. కళంకితరహితుడిగా బయటకు వస్తాననే నమ్మకం ఉందని ఆయన చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో రాజీనామా చేసిన రెండో మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇంతకు ముందు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. ధర్మాన ప్రసాద రావును సిబిఐ విచారించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారం ధర్మాన ప్రసాద రావుతోనే ఆగేట్లు లేదని అంటున్నారు.
వాన్‌పిక్ వ్యవహారంలో సిబిఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో ధర్మాన ప్రసాద రావును ఐదో నిందితుడిగా చేర్చింది. తాను మంత్రి వర్గ నిర్ణయం మేరకే వ్యవహరించానని రాజీనామా చేయడానికి ముందే ధర్మాన అన్నారు.












Click it and Unblock the Notifications