హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ: సీమాంధ్ర నేతల ప్రశ్నలు, బాబు ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణపై కేంద్రానికి మరోమారు లేఖ ఇచ్చే అంశంపై పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పలువురు సీమాంధ్ర నేతలతో మంగళవారం సంప్రదింపులు జరిపారు. ఈ చర్చ వాడిగా వేడిగా జరిగినట్లుగా తెలుస్తోంది. లేఖ ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపగా సీమాంధ్ర నేతలు తీవ్రంగా స్పందించినట్లుగా సమాచారం. భేటీలో పార్టీ నేతలు పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, పత్తిపాటి పుల్లారావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు బాబు వద్ద తమ అభిప్రాయాలు వెల్లడించారు.

చంద్రబాబు లేఖ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో.. పయ్యావుల, పత్తిపాటి వంటి నేతలు ఇప్పుడు లేఖ ఇవ్వాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించినట్లుగా సమాచారం. ఒకవేళ లేఖ ఇచ్చినా ఆ క్రెడిట్ తెలంగాణ రాష్ట్ర సమితికో బిజెపికో వెళ్తుందని అలాంటప్పుడు లేఖ ఇచ్చి లాభమేమిటని వారు బాబును ప్రశ్నించారని సమాచారం. పార్టీ లేఖ ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం అవుతుందా అని వారు ప్రశ్నించారని తెలుస్తోంది.

లేఖ ఇచ్చే అంశంపై నేతలు వరుస ప్రశ్నలు సంధించడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించిందని తెలుస్తోంది. దీంతో బాబుతో సహా నేతలు అందరూ దీనిపై మళ్లీ చర్చించుకుందామని చెప్పి సమావేశం ముగించినట్లుగా తెలుస్తోంది. భేటీ అనంతరం పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ... వారం రోజులుగా తెలంగాణ అంశంపై పార్టీలో చర్చ జరుగుతోందన్నారు. పార్టీ అధినేత బాబు నేతలను వరుసగా పిలిచి దీనిపై అభిప్రాయాలు తెలుసుకుంటున్నారని చెప్పారు.

తెలంగాణ పైన, లేఖ పైన తుది నిర్ణయం బాబుదేనని, అయితే అభిప్రాయాలు వెల్లడించే హక్కు కూడా తమకుందన్నారు. విభజనపై పార్టీలో సుదీర్ఘ చర్చ జరగాల్సిన అవసరముందని పయ్యావుల అభిప్రాయపడ్డారు. బాబు నాయకత్వంపై తమకు సెకండ్ ఒపీనియన్ లేదని, పార్టీలో కేవలం భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కానీ, అభిప్రాయ బేధాలు లేవన్నారు. టిడిపి లేఖ ఇచ్చినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదన్నారు.

కాగా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే సీమాంధ్ర నేతలు పలువురు పార్టీకి, పదవులకు రాజీనామా చేసేందుకు సైతం వెనుకాడమని చంద్రబాబుకు చెబుతున్నట్లుగా సమాచారం. దీంతో అతను లేఖ ఇచ్చేందుకు అనుకూలంగా ఉన్నప్పటికీ నేతలను బుజ్జగించిన తర్వాతే నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించి కేంద్రానికి లేఖ రాద్దామనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు ఒక్కొక్కరిని పిలిచి వారితో తన నిర్ణయాన్ని చెప్పి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట.

English summary
Seemandhra TDP leaders were questioned party chief Nara Chandrababu Naidu on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X