బిజెపి టార్గెట్ కెసిఆర్: కిషన్ రెడ్డి స్పీచ్, నాగం కూడా

నాగం జనార్దన్ రెడ్డి బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాధ్ సింగ్ సమక్షంలో నగారా సమితిని విలీనం చేశారు. మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకురాలు పుష్పలీల కూడా బిజెపిలో చేరారు. కెసిఆర్‌ను బిజెపి రాష్ట్రాధ్యక్షుడు పరోక్షంగా టార్గెట్ చేస్తే, జాతీయ నాయకుడు ఎం వెంకయ్యనాయుడు నేరుగానే టార్గెట్ చేశారు. గతంలో మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెసు విలీనం చేసుకుని, తెలంగాణకు మోసం చేసిందని, అలాగే భవిష్యత్తులో కూడా జరుగుతుందని కిషన్ రెడ్డి అన్నారు. ఆ రకంగా ఆయన తెరాసను కాంగ్రెసు విలీనం చేసుకుంటుందనే సంకేతాలు ఇచ్చారు. జాతీయ స్థాయిలో పార్లమెంటులో తగిన సంఖ్యాబలం తమ పార్టీకి మాత్రమే ఉంటుందని, తమ పార్టీని గెలిపిస్తే నేరుగా తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు.
ఇక, వెంకయ్యనాయుడు నేరుగా తెరాసను లక్ష్యం చేసుకున్నారు. మాకు 14 సీట్లు ఇవ్వండి, 17 సీట్లు ఇవ్వండి, ఢిల్లీకి వెళ్లి సపోర్టు చేస్తామని అంటున్నారని ఆయన కెసిఆర్‌ను ఉద్దేశించి అన్నారు. ముక్కును ఎలా పట్టుకుంటారని అని అడిగి, నేరుగా కమలానికి ఓటేస్తే, తాము పార్లమెంటులో బటన్ నొక్కి తెలంగాణ బిల్లును ఆమోదిస్తామని ఆయన చెప్పారు. తెరాస, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణను సాధించలేవని ఆయన అన్నారు.
పార్టీ, ప్రభుత్వం ఏదైనా తెలంగాణ బిల్లు పెడితే మద్దతిస్తామని బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. తెలంగాణ విషయంలో వివిధ పార్టీలు జిల్లాకో మాట మాట్లాడుతున్నాయని, కాంగ్రెసు తెలంగాణకు ఎప్పుడూ వ్యతిరేకమేనని ఆయన అన్నారు. కాంగ్రెసును గద్దె దింపినప్పుడే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. ఎన్డీఎ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
ప్రత్యేక తెలంగాణ సాధించే సత్తా తమ పార్టీకి మాత్రమే ఉందని బిజెపి సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగరరావు అన్నారు. త్వరలో పూర్తి స్థాయి కమిటీలు వేస్తామని, ప్రత్యేక తెలంగాణ పోరాటానికి అనుగుణంగా ఈ కమిటీలు పనిచేస్తాయని ఆయన అన్నారు.
అదివారంనాడు ఇదే మైదానంలో తెరాస బహిరంగ సభ జరిగింది. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు వివేక్, మందా జగన్నాథం, సీనియర్ నేత కె. కేశవరావు పార్టీలో చేరిన సందర్భంగా తెరాస బహిరంగ సభ జరిగింది. సోమవారం బిజెపి అదే మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి తెలంగాణ నినాదం చేసింది. వచ్చే ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకోబోమని కెసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో తన బలాన్ని తెలంగాణలో పెంచుకోవడానికి బిజెపి రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఉప ప్రాంతీయ పార్టీతో తెలంగాణ సాధ్యం కాదని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. 2004లో కాంగ్రెసుతో కలిసి తెరాస పోటీ చేసి, మంత్రివర్గంలో చేరిందని, తెలంగాణను సాధించలేకపోయిందని ఆయన అన్నారు. శాసించే శక్తి ఆంధ్రవాళ్లకు ఉంది గానీ తెలంగాణవాళ్లకు లేదని ఆయన అన్నారు. తెరాస 15 సీట్లు గెలిస్తే ఎలా తెలంగాణ తెస్తుందని, ఎవరి వద్దకు వెళ్తారని, కాంగ్రెసు తెలంగాణ ఇస్తుందా అని ఆయన అడిగారు. తెరాసకు 15 సీట్లు ఇస్తే కెసిఆర్ రాజ్‌నాథ్ సింగ్ వద్దకు వెళ్లాలి, బిజెపిని ఓడించాలని కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. కచ్చితంగా బిజెపికే ఓటు వేసి తెలంగాణ తెచ్చుకుందామని ఆయన అన్నారు.
తెరాసకు కేంద్రంలో, రాష్ట్రలో మంత్రి పదవులు ఇచ్చి, రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చి, ఉమ్మడి ప్రణాళికలో చేర్చారని, తెలంగాణను మోసం చేశారని నాగం అన్నారు.












Click it and Unblock the Notifications