చంద్రబాబుతో పొత్తు ఉండదు: రాజ్‌నాథ్ సింగ్ హింట్

నాగం జనార్దన్ రెడ్డి తన తెలంగాణ నగారా సమితిని పార్టీలో విలీనం చేసిన సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటైన తెలంగాణ ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోమని ఆయన స్పష్టంగా చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన నెల లోపల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మాట ఇస్తే వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి విజయం ఖాయమని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమవుతుందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఏ శక్తీ ఆపలేదని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజలను కాంగ్రెసు మోసం చేసిందని, విశ్వాస ఘాతుకానికి పాల్పడిందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు హామీలు ఇస్తుంది గానీ అమలు చేయదని ఆయన అన్నారు. తెలంగాణలో ఆత్మబలిదానాలకు కాంగ్రెసు బాధ్యత వహించాలని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును ప్రతిపాదిస్తే తాము మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం బిజెపి సంప్రదాయం కాదని ఆయన అన్నారు. తెలంగాణ తమ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు.
కాంగ్రెసు కేంద్ర ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తావిస్తూ ఆయన విరుచుకుపడ్డారు. చైనా చొరబాటు కేంద్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆయన అన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ జరగనంత అవినీతి ప్రస్తుత యుపిఎ ప్రభుత్వ హయాంలో జరిగిందని ఆయన అన్నారు. ఖేల్ గేట్, కోల్ గేట్, రైల్వే గేట్ - ఇలా అవినీతి విస్తరించిందని ఆయన అన్నారు. తమ పార్టీ నేతలపై ఆరోపణలు వస్తే పదవుల నుంచి తప్పుకుని క్లీన్ చిట్ వచ్చే వరకు పదవులను చేపట్టబోరని ఆయన అన్నారు. అవినీతి ఆరోపణలు వస్తే కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేశారని ఆయన గుర్తు చేశారు. తాము ప్రతిపక్షంలో ఉండి వాచ్ డాగ్ పాత్రను పోషిస్తున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications