స్పాట్ ఫిక్సింగ్‌లో టిఆర్ఎస్ నేత?: పోలీసుల గాలింపు
హైదరాబాద్/నిజామాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్పాట్ పిక్సింగ్ వ్యవహారంలో నిజామాబాద్ జిల్లా బోధన్ తెలంగాణ రాష్ట్ర సమితి నియోజకవర్గం ఇంఛార్జ్ షకీల్ మహమ్మద్ పాత్ర ఉన్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో షకీల్ పాత్ర ఉన్నట్లు వార్తలు రావడం సంచలనం రేపుతోంది. 15 రోజుల నుంచి షకీల్ ఆచూకీ తెలుసుకునేందుకు ఢిల్లీ, కోల్‌కతా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
బంజారాహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి ఆరా తీసినట్లుగా సమాచారం షకీల్ బంధువు ఒకరిని పోలీసులు ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. షకీల్ రెండు నకిలీ పేర్లతో బుకీగా పని చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. స్పాట్ ఫిక్సింగులో పాత్ర ఉందని అనుమానిస్తున్న దావూద్ ఇబ్రహీంతో షకీల్ సంబంధాలను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఫిక్సింగ్ ఉదంతం బయటపడగానే షకీల్ విదేశాలకు వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. విద్యావంతుడైన షకీల్ సంపన్న కుటుంబానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. పన్నెండేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఏడేళ్ల క్రితం ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.
నకిలీ పాసుపోర్టులపై వ్యక్తులను దేశ సరిహద్దులు దాటించారనే అభియోగాలు అతనిపై ఉన్నాయి. 2009లో అతను తెరాసలో చేరారు. టిడిపి, టిఆర్ఎస్ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పటి నుండి క్రికెట్ బుకీగా అవతారమెత్తి ఉంటారని భావిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలకు షకీల్ దూరం ఉండటంతో అధిష్టానం ఆయనపై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అధిష్టానం హెచ్చరికలతో అప్పుడప్పుడు బోధన్ వస్తూ.. కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు. తెరాస ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితలతో సత్సంబంధాలు నెరపుతూ పార్టీలో ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు చేశారట. కాగా ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీ బహిష్కరించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications