తెలంగాణ: మన్మోహన్, చిద్దూ లేకుండా తేల్చేస్తారా?
న్యూఢిల్లీ: తెలంగాణపై శుక్రవారం జరిగే కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం పాల్గొనే అవకాశాలు లేవని వార్తలు వస్తున్నాయి. వారిద్దరు లేకుండానే కోర్ కమిటీ తెలంగాణ అంశాన్ని తేల్చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తెలంగాణపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ నిర్ణయమే అంతిమమని అంటున్నారు. ఈ స్థితిలో తెలంగాణపై వారిద్దరి హాజరు ముఖ్యమని అంటున్నారు.
తెలంగాణాపై కాంగ్రెస్ కోర్ కమిటీ తేల్చేయబోతుందనే వార్తల నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణాపై పార్టీ అధిష్ఠానం తేల్చేసేందుకు అధిష్టానం సిద్ధపడిందని తెలంగాణ నాయకులు భావిస్తుండగా, రాష్ట్రాన్ని విడగొట్టకుండా చూడడానికి సీమాంధ్ర నాయకులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే రాజీనామాలకు సిద్ధపడాలని సీమాంధ్ర నాయకులు భావిస్తున్నట్లు సమాచారం.

ఢిల్లీలో శుక్రవారంనాడు జరిగే కోర్ కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, కాంగ్రెస్ ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ పాల్గొంటారని సమాచారం.
ఈ సమావేశంలో డిసెంబర్ 9నాటి ప్రకటన చేసిన అప్పటి హోం మంత్రి చిదంబరం ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు. డాలర్ విలువతో పోల్చితే భారత రూపాయి విలువ రోజు రోజుకీ పతనమవుతున్న దృష్ట్యా తక్షణం తీసుకోవలసిన ఆర్థిక చర్యల గురించి ఆలోచించడానికి చిదంబరం అమెరికా వెళ్లారు.
అలాగే కోర్ కమిటీ సమావేశంలో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా పాల్గొనడం లేదని తెలుస్తోంది. ముందుగా నిర్ణయించిన ఒక కార్యక్రమానికి ప్రధాని హాజరు కావలసి ఉంది. కోర్ కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు జరుగుతుంది. రేపు జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రంనుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పాల్గొంటారు.












Click it and Unblock the Notifications