Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేతలకు సుప్రీం హెచ్చరిక: 162మంది ఎంపీలపై కేసులు

Convicted lawmakers stand disqualified on verdict day: SC
న్యూఢిల్లీ: క్రిమినల్ కేసుల్లో రాజకీయ నాయకులు దోషులుగా తేలితే వారు ఎన్నికలలో పోటీకి అర్హులు కాదని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. లిల్లీ థామస్, స్వచ్ఛంద సేవాసంస్థ లోక్ ప్రహరికి చెందిన శుక్లా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాల పైన విచారణ నిర్వహించిన కోర్టు నిన్న సంచలన తీర్పు ఇచ్చింది. తద్వారా చట్టంలోని 8(4) సెక్షన్ న్యాయసమ్మతం కాదని తేల్చి చెప్పింది.

దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువడిన మూడు నెలల వరకు అనర్హత వేటు వేయరాదని, ఆ వ్యవధిలో ప్రజాప్రతినిధి ఉన్నత న్యాయస్థానాలలో సవాల్ చేసుకోవచ్చునని, పిటిషన్ దాఖలు చేశాక అది పరిష్కారం అయ్యేంత వరకు అనర్హత వేటు వర్తించదని చట్టంలో ఉంది. ఇది చట్టంలోని 8(4) సెక్షన్. అయితే దానికంటే ముందున్న 8(3)లో మాత్రం నేరం రుజువై రెండేళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష పడిన వారు పోటీకి అనర్హులని, జైలు నుంచి విడుదలైన ఆరేళ్ల వరకు పోటీ చేయడానికి అనర్హులని ఉంది.

దీనిపై వారు వ్యాజ్యం వేశారు. దీనిని విచారించిన సుప్రీం కోర్టు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(4) అధికారాలే ప్రశ్నార్థకమని, ఇది అపరిమిత అధికారమని తాము భావిస్తున్నామని, దోషిగా నిర్ధారణ అయిన రోజు నుంచే అనర్హత మొదలవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఈ తీర్పు కంటే ముందు ఉన్నత న్యాయస్థానాల్లో సవాల్ చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు ఈ నిర్ణయం వర్తించదని తెలిపింది.

కింది కోర్టులో దోషిగా నిర్ధారణ అయిన రోజు నుంచే వారు చట్ట సభల్లో సభ్యత్వం కోల్పోయినట్లేనని జస్టిస్ ఏకే పట్నాయక్, జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.

వ్యాజ్యం వేసిన వారి వాదనలు

నేరస్థులు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కొనసాగడం సరికాదని పిల్‌లో పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని కొన్ని సెక్షన్లు రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని వారు వాదించారు. రాజ్యంగంలోని 102(1), 191(1) నిబంధనల కింద ప్రజా ప్రతినిధులను ఏ కారణం చేత అనర్హులుగా ప్రకటించాలో స్పష్టంగా ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. రాజ్యాంగంలోని ఈ నిబంధనలు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మండలి సభ్యులకు కూడా వర్తిస్తుందని నారిమన్ వాదించారు.

అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(4)ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆమోదించిందని ప్రభుత్వం తరఫున వాదించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు. ఒక ప్రజా ప్రతినిధి నేరస్థుడని కింది కోర్టు తీర్పునిచ్చిన వెంటనే అతడిని అనర్హుడిని చేస్తే అనేక సమస్యలు ఏర్పడవచ్చునని వాదించారు. ఆ ప్రజా ప్రతినిధి అధికార పార్టీ సభ్యుడైతే ప్రభుత్వమే మైనారిటీలో పడిపోయే అవకాశాలున్నాయని తెలిపారు.

అంతేకాక అనర్హత వేటు పడ్డ తర్వాత ఉప ఎన్నికలు జరగాల్సి ఉంటుందని, ఈ ఎన్నికల తర్వాత అతడు నేరస్థుడు కాదని పై కోర్టు నిర్ధారిస్తే మొత్తం ప్రక్రియ వృథా అవుతుందని వివరించారు. ఈ దృష్ట్యానే కింది కోర్టులో ప్రజా ప్రతినిధి దోషిగా తేలితే పై కోర్టుకు వెళ్లి నిర్దోషిత్వం నిరూపించుకునేందుకు, అంతవరకు పదవిలో కొనసాగేందుకు పార్లమెంట్ వీలు కల్పించిందని పేర్కొన్నారు. కింది కోర్టు తీర్పులను పై కోర్టులు కొట్టివేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని లూథ్రా వాదించారు.

అంతేకాక రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూలులోని 2, 3 జాబితాల్లో పేర్కొనని అంశాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌కు రాజ్యాంగమే కల్పించిందన్నారు. కాగా అనర్హత వేటును కోర్టులో సవాలు చేసే అధికారం ప్రజా ప్రతినిధికి ఉంటుందని నారిమన్ చేసిన వాదన సరికాదని మరో అడిషనల్ సొలిసిటర్ జనరల్ పరస్ కుహాద్ అన్నారు. సిఆర్‌పిసిలోని సెక్షన్ 38 కింద అనర్హత వేటును తోసిపుచ్చే అధికారం కోర్టుకు ఉండదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం సుప్రీం వాదనలను తోసిపుచ్చింది.

162 మంది ఎంపీలు, 1460 మంది ఎమ్మెల్యేలు

ప్రస్తుతం లోక్‌సభలోని 543 మంది పార్లమెంటు సభ్యుల్లో 162 మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరిలో 76 మందిపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. నేరం రుజువైతే వీరికి ఐదేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడుతుంది. అలాగే దేశవ్యాప్తంగా 1460 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 30శాతం మందికి కనీసం ఐదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.

నిజానికి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని వెసులుబాటు వల్ల నేరస్థులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు పదవుల్లో కొనసాగుతున్నారని, ఈ పరిస్థితిని సరిదిద్దాలని, చట్ట సవరణ చేయాలని ఎన్నికల సంఘం ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతోంది. కానీ రాజకీయ పార్టీలు ముందుకు రావడం లేదు. అధికార పార్టీ నేతలు ప్రత్యర్థులపై కావాలనే తప్పుడు కేసులు పెట్టి అనర్హులుగా చేయడానికి ప్రయత్నిస్తున్నాయన్న వాదనలు ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+