'మోడీతో బాలయ్య.. మతలబేంటి: జగన్ పిఎం కావొచ్చు'
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ వద్దకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన బావమరిది బాలకృష్ణను పంపించడంలోని మతలబేంటో చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు సోమవారం డిమాండ్ చేశారు. బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకుంటుందా లేదా చెప్పాలని వారు నిలదీశారు.
బిజెపితో పొత్తు చారిత్రక తప్పిదమని చెప్పిన బాబు ఇప్పుడు బాలయ్యను మోడీ వద్దకు ఎందుకు పంపించారన్నారు. ఆయన వ్యూహమేంటని ప్రశ్నించారు. కాంగ్రెసు, బిజెపిలతో చంద్రబాబు తెర వెనుక స్నేహాలు చేస్తున్నారని, తమ పార్టీ మాత్రం ఇరు పార్టీలకు సమదూరం పాటిస్తుందన్నారు. ప్రజల మద్దతు ఉంటే తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి కూడా కావొచ్చునన్నారు.

కాగా రాష్ట్రం కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డిలు సోమవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వారు కలెక్టరేట్ వద్ద దీక్షకు దిగారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు.
తెలుగుతల్లి కడుపుకోతకు గురయ్యే పరిస్థితి కల్పించినా, విభజన పేరుతో సీమకు అన్యాయం జరగబోతుందని తెలిసినా అధికార పార్టీ నేతలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఏ ప్రాంతాన్ని అవమానించేలా ఎప్పుడు మాట్లాడలేదన్నారు. ఇరు ప్రాంతాల అభివృద్ధిని ఆయన కాంక్షించారన్నారు.












Click it and Unblock the Notifications