11 మంది సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్, మైక్ లాగిన ఎంపి

సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలని టిడిపి ఎంపీలు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కాంగ్రెసు ఎంపీలు లోకసభలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో కమల్ నాథ్ పదకొండు మంది ఎంపీలను సస్పెన్షన్ చేస్తూ తీర్మానం పెట్టారు.
కమల్ నాథ్ తీర్మానం పైన భారతీయ జనతా పార్టీ మండిపడింది. ఆ పార్టీ లోకసభ పక్ష నేత సుష్మా స్వరాజ్ దీనిని తప్పు పట్టారు. తాము మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఇంత రాద్ధాంతం జరగలేదని, విభజన తీరు సరికాదని ఆమె అన్నారు. సస్పెన్షన్ పై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. బిజెపి తీర్మానంపై డివిజన్ కోరింది. సభలో గందరగోళం చెలరేగడంతో స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
కాగా, టిడిపి ఎంపీలు వెల్‌లోకి దూసుకుపోయి స్పీకర్ మైక్ లాగేశారు. ఎంపి శివ ప్రసాద్ చర్నాకోలాతో తనను తాను కొట్టుకున్నారు. సస్పెన్షన్ అయిన వారిలో టిడిపి ఎంపీలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కొణకళ్ల నారాయణ, శివ ప్రసాద్, కిష్టప్ప, కాంగ్రెసు ఎంపీలు హర్ష కుమార్, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంత వెంకట్రామి రెడ్డి, సాయి ప్రతాప్, రాయపాటి సాంబశివ రావులు ఉన్నారు. రాయపాటి సభలో లేకున్నప్పటికీ కమల్ నాథ్ చదవడం గమనార్హం. వీరిని పార్లమెంటు సమావేశాలు ముగిసి వరకు సస్పెండ్ చేశారు.
ఆలస్యంగా వచ్చిన ఝాన్సీ
సస్పెన్షన్ సమయానికి బొత్స ఝాన్సీ సభలో లేరు. ఆమె సభకు ఆలస్యంగా వచ్చారు. నరసాపురం ఎంపి కనుమూరి బాపిరాజు సస్పెన్షన్ సమయానికి బయటకు వెళ్లిపోయారు. సభకు హాజరు కాని వారిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి, సబ్బం హరి, ఎస్పీవై రెడ్డి, చింతా మోహన్ ఉన్నారు.
పొడిగింపు
మరోవైపు పార్లమెంటు సమావేశాలను ఐదు రోజులు పొడిగించారు. సెప్టెంబర్ 5వ తేది వరకు సమావేశాలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications