వందే భారత్ రైళ్లపై రైల్వే కీలక నిర్ణయం
మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అధునాతన సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాన నగరాల మధ్య ఉండే దూరాన్ని సాధ్యమైనంత తక్కువ సమయంలో చేరుకునేందుకు మెరుగైన ఫీచర్లతో వందే భారత్ రైళ్లను తీసుకువస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 25 మార్గాల్లో పరుగులు పెడుతున్న ఈ రైళ్లు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి.
అన్ని జోన్ల నుంచి వీటికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో తయారీపై పూర్తిస్థాయిలో అధికారులు దృష్టిసారించారు. ఒక వందే భారత్ రైలు తయారీకి రూ.130 కోట్ల ఖర్చవుతోంది. తాజాగా 8వేల వందే భారత్ కోచ్ ల తయారీకి భారతీయ రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలను వందే భారత్ రైళ్లు కవర్ చేస్తున్నాయి. కొన్ని నగరాలకు సంబంధించిన స్టేషన్లలో ఈ రైళ్లు ఆగకపోతుండటంతో తమకు కూడా అందుబాటులోకి తేవాలంటూ దేశవ్యాప్తంగా బీ గ్రేడ్ రైల్వే స్టేషన్ల నుంచి ప్రతిపాదనలు అందాయి.

చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో స్లీపర్ వేరియంట్‌లో 3,200 కోచ్‌లను తయారుచేయబోతున్నారు. ప్రస్తుతం కూర్చోవడానికి మాత్రమే వీలుంది. లాంగ్ జర్నీ చేయాలనుకునేవారికి స్లీపర్ రైళ్లు సౌకర్యంగా ఉంటాయి. 8000 కోచ్‌లలో ఈ సంవత్సరం 700 తయారవుతాయి. అంటే 50 వందేభారత్ రైళ్లు కొత్తగా పట్టాలెక్కనున్నాయి. స్లీపర్ రైలు మాత్రం వచ్చే ఏడాది ప్రారంభం నాటికి రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇలాంటి రైళ్లు దాదాపు 500 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications