విజయవాడ ముంపు వెనుక - అసలు కారణం..!?
విజయవాడ నగరం మునిగిపోయింది. బుడమేరు కన్నెర్ర చేసింది. కనుచూపు మేరా నీరే విస్తరించింది. లక్షలాదిమందిని వరద బాధితులుగా మిగిల్చింది. అటు కృష్ణమ్మ ఉగ్ర రూపం... ఇటు బుడమేరు కన్నెర్రతో బెజవాడ బెంబేలెత్తింది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. విజయవాడలో వరద ముంపుకు అసలు కారణం ఏంటి. దీని వెనుక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజా నిర్ణయాలతో పాటుగా 20 ఏళ్ల నిర్లక్ష్యం విజయవాడను ముంచేసింది.
భారీ నిర్లక్ష్యం
విజయవాడను బుడమేరు ముంచేసింది. జనజీవనం అస్తవ్యస్తం చేసింది. పొర్లింది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు హోరెత్తిన చిన్నా పెద్ద వాగులను కలుపుకొని పూనకమొచ్చినట్లుగా విరుచుకుపడింది. బుడమేరు పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి జలం ప్రవేశించింది. చూస్తుండగానే ఒక్కో అడుగు పెరుగుతూ పోయింది. విజయవాడ నగరం ముంపుకు గురైంది. 20ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో నేడు దాని ఫలితం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎవరు బాధ్యులు
బుడమేరు ప్రాంతం పూర్తిగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. 2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కింది. బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను 2008 నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ కరకట్ట ఇప్పుడు ఆనవాళ్లు కూడా లేవు. కాలనీలకు కాలనీలను విస్తరించారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీల నేతలు పాత్రధారులే. విజయవాడలో ఆక్రమణలతో జల ప్రవాహానికి తగిన దారిలేకుండా పోయింది. దీంతో, బుడమేరు కట్టలు తెంచుకున్నట్లుగా చెలరేగిపోయింది.
తాజా ముంపు వెనుక
తాజా భారీ వర్షాలతో ఇబ్రహీంపట్నం మండలం తలప్రోలు వద్ద బుడమేరుకు గండి పడింది. వెలగలేరు వంతెన వద్ద 11 షట్టర్లను 11 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదలటంతో ఆ ప్రభావం విజయవాడ నగరం పైన పడింది. వెలగలేరు వద్ద షట్టర్లు ఎత్తకపోతే ఎగువ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని..క్రిష్ణ వరద వెనక్కుతన్ని ఎన్టీపీఎస్ ప్లాంట్ లోకి నీరు చేరే ప్రమాదం ఉందని ఒత్తిళ్లు రావటంతోనే వెలగలేరు షట్లర్లను శనివారం రాత్రికి రాత్రి ఎత్తటంతోనే విజయవాడను వరద ముంచెత్తినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications