గోశాల రచ్చ ఏమని స్టార్ట్ చేశారో గానీ.. తిరుమలలో అగ్ని ప్రమాదం
TTD Goshala: ప్రపంచంలోనే అత్యంత పవిత్రక్షేత్రమైన తిరుమలలో వరుస అపచారాలు చోటుచేసుకుంటోండటం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తిరుమల లడ్డూపై దుష్ప్రచారంతో ఆరంభమైన ఈ ఉదంతాలు.. చివరికి శ్రీవారి ఆలయంలోకి చెప్పులతో ప్రవేశించేంత వరకు చేరాయంటూ మండిపడుతోంది.
తిరుపతి లడ్డూ కౌంటర్ల వద్ద తొక్కిసలాట, గోశాలలో గోవుల మృత్యువాత వంటి ఘటనలు సంభవిస్తోన్నాయని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపిస్తోంది.

కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తరువాత వరుసగా జరుగుతున్న ఈ గోమరణాలను టీటీడీ ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందంటూ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించిన విషయం తెలిసిందే. దేశంలో గోవును అత్యంత పవిత్రమైన జంతువుగా హిందువులు పూజిస్తుంటారని, సకల దేవతల స్వరూపిణీ అయిన గోమాతకు టీటీడీ గోశాలలో దారుణమైన పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు.
దీనిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందించడం, సవాల్ విసరడం.. ఈ ఉదంతం మొత్తం మరో మలుపు తిరగడానికి కారణమైంది. గోవుల మరణంపై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించడానికి గోశాలకు రావాలంటూ సవాల్ విసిరారు పల్లా శ్రీనివాస్.
దాన్ని భూమన స్వీకరించడం, గోశాలకు వెళ్లడానికి ప్రయత్నంచడం, పోలీసులు ఆయనను అడ్డుకోవడం వంటి పరిణామాలు చకచకా చోటు చేసుకున్నాయి. ఫలితంగా తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గోశాలలో గోవులు మరణించాయంటూ అసత్య ప్రచారం చేశారంటూ టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూమనపై పోలీసులు కేసు సైతం నమోదు చేశారు.
ఈ పరిణామాల మధ్య తిరుమలలో మరో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. తిరుమలలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ కారు దగ్ధమైంది. కౌస్తుభం అతిథిగృహం పార్కింగ్ ప్రదేశంలో ఈ ఘటన సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
కౌస్తుభం పార్కింగ్ స్థలంలో నిలిపివుంచిర డస్టర్ కారులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒంగోలు నుంచి తిరుమలకి వచ్చిన భక్తులు.. కారులో నుంచి పొగ రావడాన్ని గుర్తించారు. వెంటనే కిందికి దిగి బయటికి వెళ్లారు. దీనితో ప్రమాదం తప్పినట్టయింది.
కారు ఇంజిన్, ముందు భాగం మొత్తం మంటల బారిన పడింది. పూర్తిగా దగ్ధమైంది. అందులో ఉన్న భక్తులు కారు వెనుక భాగం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనస్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు.
దీనికి సంబంధించిన ఓ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. తిరుమలలో ఈ ఘటన చోటు చేసుకుందని నెటిజన్లు చెబుతున్నారు. టీటీడీ గోశాల వివాదంతో ముడిపెట్టి చూస్తోన్నారు. గోశాల రచ్చ మొదలైన తరువాత వరుస ఉదంతాలు సంభవిస్తోన్నాకంటూ ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications