రామకుప్పంలో చంద్రబాబు పీఏతో పాటు 45 మందిపై కేసు నమోదు.. కారణమిదే!!
చిత్తూరు జిల్లా రామకుప్పం లో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. కులం పేరుతో మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులను ఎస్ ఐ కృష్ణయ్య దూషించారు అంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ ఆందోళన కు పిలుపునిచ్చిన క్రమంలో నిన్న కుప్పంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.
తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని ధర్నా చేయడంతో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం టిడిపి నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ తో సహా 45 మందిపై రామకుప్పం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

రామకుప్పం మండలం ఉనిసిగానిపల్లె మాజీ సర్పంచ్ మహాదేవిని గతవారం ఎస్సై కృష్ణయ్య దూషించారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో దళిత వర్గానికి చెందిన మాజీ సర్పంచ్ మహాదేవిని దూషించారని ఎస్సై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం నాడు చలో రామకుప్పం కార్యక్రమం నిర్వహించగా, నాలుగు మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ సంఖ్యలో చేరుకొని ఎస్సై కృష్ణయ్య పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన నిర్వహించారు.
నిరసనలో భాగంగా రామకుప్పం లో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ కూడా చేశారు. దీంతో టిడిపి శ్రేణులు నిరసన ద్వారా తమ విధులకు ఆటంకం కలిగించారని హెడ్ కానిస్టేబుల్ మణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆందోళన నిర్వహించిన టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు.

చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ తో పాటు మరో 44 మందిపై రామకుప్పం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తమపై కేసులు నమోదు చేయడంపై టిడిపి శ్రేణులు మండిపడుతున్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి వైసీపీ ప్రభుత్వం పని చేస్తుందని, అందులో భాగంగానే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications