చనిపోతున్నానంటూ భర్తకు ఫోన్: వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. తాను చనిపోతానంటూ భర్తకు ఫోన్‌లో సమచారమిచ్చిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మునిపల్లె మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన వీరన్న, శ్రీలత (24) దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కూతురు మేఘన (3) ఉంది.

నెల క్రితం నగరానికి వచ్చి జగద్గిరిగుట్ట శ్రీనివాసనగర్ సమీపంలోని ఉమాదేవినగర్‌లో అద్దెకు ఉంటున్నారు. వీరన్న చందానగర్‌లో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం కూడా గొడవ జరగ్గా ఎవరి పుట్టింటికి వారు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.
భర్త బయటికి వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న శ్రీలత భర్తకు ఫోన్‌చేసి 'నీవు వచ్చేసరికి నా శవాన్ని చూస్తావు' అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత ఇంటి పైకప్పునకు తాడుతో ఉరేసుకొంది. భర్త ఇంటికి వచ్చి చూడగా అప్పటికే చనిపోయి కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.