జగన్ ప్రభుత్వానికి సవాల్ గా : అమరావతికి మద్దతు - 45 రోజుల మహా పాదయాత్ర : తుళ్లూరు టు తిరుమల..!!
ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతి వాసుల నిరసనలు మొదలయ్యాయి. ఒక వైపు న్యాయ పోరాటం చేస్తూనే..మరో వైపు నిరసనలు కొనసాగిస్తున్నారు. వీరికి రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించినా..ఇప్పుడు పూర్తిగా ఆ ప్రాంత రైతులు..మహిళలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయంలో మార్పు లేదని పదే పదే స్పష్టం చేస్తోంది. అయినా .. దాదాపుగా 22 నెలలుగా రాజధాని పరిసర గ్రామాల రైతులు-స్థానికులు తమ ఆందోళన మాత్రం వీడటం లేదు.

అమరావతి రైతలు మహా పాదయాత్ర
తొలుత టీడీపీతో సహా మరి కొన్ని పార్టీలు వారికి మద్దతుగా నిలిచాయి. ఇక, అమరావతిని కొనసాగిస్తా మని హామీ ఇస్తేనే తాము బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని జనసేన అధినేత పలుమార్లు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల ప్రకటన చేసి డిసెంబరు 17వ తేదీకి రెండేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ నిరసనల్లో భాగంగా.. మహా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు.

అమరావతి ప్రాధాన్యత వివరిస్తూ
అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐకాస ఆధ్వర్యంలో 45 రోజుల పాటు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో మహా పాదయాత్ర నిర్వహించనున్నారు. తుళ్లూరు నుంచి తిరుమల వరకు ఈ యాత్ర సాగనుంది. నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు జరిగే యాత్ర షెడ్యూల్ రాజధాని ఐకాస ఖరారు చేసింది. ప్రతి రోజూ ఉదయం 9 గటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాదయాత్ర సాగుతుంది. భోజన విరామం అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటలకు ముగుస్తుంది.

ప్రభుత్వానికి సవాల్ గా
వారానికి 6 రోజుల పాటు సాగనుంది. 400 కి.మీకు పైగా ఉండే ఈ దూరాన్ని కాలినడకన రోజుకు సగటున 13 కి.మీ మేర పాదయాత్ర కొనసాగుతుందని ఐకాస నేతలు చెబుతున్నారు. ఇందులో 200 మందికి పైగా రైతులు, రైతు కూలీలు, మహిళలు, వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు పాల్గొంటారని చెప్పుకొచ్చారు. తుళ్లూరు నుంచి తిరుమల వరకు సాగే ఈ పాదయాత్ర గ్రామాల మధ్య నుంచి సాగేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. తద్వారా ప్రజల్లో అమరావతిపై అవగాహన కల్పించి చైతన్యపరిచేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.

రెండేళ్లు అవుతున్న మూడు రాజధానుల నిర్ణయం
ఒకే రాజధానిగా అమరావతి ఉంటే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది. మూడు రాజధానుల నిర్ణయాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను ప్రజలకు వివరిస్తారని నేతలు వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా శరన్నవరాత్రోత్సవాలు కావటంతో నిరసన శిబిరాల్లో అమ్మవారిని లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి పూజలు చేశారు. ఉద్దండరాయునిపాలెంలో ఐకాస జెండాలు పట్టుకొని రైతులు, మహిళలు ర్యాలీగా వెళ్లి పొంగళ్లు సమర్పించారు.
Recommended Video

ప్రభుత్వ నిర్ణయం పైన ఉత్కంఠ
ప్రస్తుతం న్యాయస్థానాల్లో మూడు రాజధానుల అంశం పైన భారీ సంఖ్యలో దాఖలైన పిటీషన్ల పైన విచారణ సాగుతోంది. కోర్టులో న్యాయ పరంగా అనుమతి వస్తేనే మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం అధికారికంగా ముందుకెళ్లే అవకాశం ఏర్పడతుంది. అయితే, ఇప్పుడు అమరావతి దాటి నిరసనలకు సిద్దం అవుతున్న సమయం లో ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications