పవన్ ఆర్థిక మూలాలపై గురిపెట్టిన అంబటి రాంబాబు- ఢిల్లీకి ఛలో
అమరావతి: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం.. బ్రో. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కింద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మించారు. సముద్రఖని దర్శకుడు. ఈ సినిమా ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి కేంద్రబిందువు అయింది.
గతంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేసిన డాన్స్‌ను ఇందులో పేరడీగా పెట్టడం వివాదానికి దారి తీసింది. బ్రో సినిమాలో ఓ సీన్‌లో మంత్రి అంబటి రాంబాబును అనుకరిస్తూ కమేడియన్ పృథ్వీ డాన్స్ చేయడం, ఆయనపై పవన్ కల్యాణ్ సెటైర్లు వేయడం కలకలం రేపుతోంది.

దీనిపై అంబటి రాంబాబు ఇప్పటికే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశాన్ని పెట్టి మరీ పవన్ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు సంధించారు. దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్‌ను హీరోగా పెట్టి తాను కూడా సినిమా తీస్తానని పేర్కొన్న ఆయన.. స్క్రిప్ట్‌ను కూడా వివరించారు. కొన్ని టైటిళ్లనూ సూచించారు.
మ్రో, తాళి-ఎగతాళి, పెళ్లి పెటాకులు, బహు భార్యల ప్రావీణ్యుడు.. వంటి టైటిళ్లు పరిశీలనలో ఉన్నట్లు అంబటి రాంబాబు విలేకరులకు వివరించారు. బ్రో సినిమాకు మాటలు, స్క్రీన్‌ప్లే రచయితగా పని చేసిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌నూ హెచ్చరించారు.
అక్కడితో ఆగలేదాయన. బ్రో సినిమా వ్యవహారం, దీని బడ్జెట్, పవన్ కల్యాణ్‌కు ఇచ్చిన రెమ్యునరేషన్, విడుదల తరువాత వచ్చిన కలెక్షన్లు.. వంటి అంశాలన్నింటిపైనా కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నారు. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ అధికారులను కలిసి ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది.
దీనికోసం అంబటి రాంబాబు.. ఈ సాయంత్రం దేశ రాజధానికి బయలుదేరి వెళ్లనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఆయా దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులతో అపాయింట్‌మెంట్ ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కారణంగా ఢిల్లీలోనే ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంపీలతో కలిసి అంబటి రాంబాబు దర్యాప్తు సంస్థల అధికారులను కలుస్తారని తెలుస్తోంది.

బ్రో మూవీ కోసం పెట్టిన ఖర్చును తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్నారైల నుంచి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సమకూర్చుకున్నారంటూ అంబటి రాంబాబు ఇదివరకే ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ సొమ్ము మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీనే పవన్ కల్యాణ్‌కు ప్యాకేజీ రూపంలో అందజేసిందంటూ ఆయన ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications