కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై కీలక వివరాలు వెల్లడించిన మంత్రి బొత్స
విశాఖపట్నం: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఉదయం 233 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. మధ్యాహ్నానికి మృతుల సంఖ్య 288కి చేరింది. 747 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది.
ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో సమీక్ష నిర్వహవంచారు. మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరావు ఇందులో పాల్గొన్నారు. జిల్లా అధికారులు దీనికి హాజరయ్యారు. అనంతరం బొత్స విలేకరులతో మాట్లాడారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైన నేపథ్యంలో బాలాసోర్‌లో చిక్కుకుపోయిన తెలుగువారిని తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

జగన్ ఆదేశాల మేరకు ఇచ్ఛాపురం నుంచి సరిహద్దుల్లో ఉన్న అన్ని ఆసుపత్రులను సిద్ధం చేశామని, అన్ని కలెక్టరేట్‌లలోనూ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని అన్నారు. 65 అంబులెన్స్‌లు, వైద్యుల బృందాన్ని బాలాసోర్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ముగ్గురు ఐఎఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన రెండు బృందాలను ఒడిశాకు పంపించినట్లు వివరించారు.
అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి ఓ ఛాపర్‌ను కూడా సిద్ధంగా ఉంచామని, అవసరమైతే విశాఖపట్నం నుంచి నేవీ అధికారుల సహకారాన్ని కూడా తీసుకుంటామని బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటివరకు ఏపీ నుంచి ఎవరూ చనిపోయినట్లు సమాచారం లేదని, కొందరు ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం అందినట్లు ఆయన చెప్పారు. ఒడిశాలో కూడా తెలుగువారికి చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 482 మంది ఏపీకి చెందిన వారు ఉన్నట్టుగా గుర్తించామని బొత్స పేర్కొన్నారు. విశాఖపట్నం- 309, రాజమండ్రి- 31, ఏలూరు- 5, విజయవాడ- 137 మంది ఉన్నట్లు చెప్పారు. వీరందరి ఫోన్ నంబర్లను సేకరించామని, ఆరా తీస్తోన్నామని అన్నారు. వారిలో 267 మంది సురక్షితంగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. 20 మందికి స్వల్పంగా గాయాలైనట్లు వివరించారు. 82 మంది ప్రయాణాలను రద్దు చేసుకున్నట్టు తేలిందని అన్నారు.
113 మంది ఫోన్లు ఎత్తట్లేదని, మరికొందరి ఫోన్లు స్విచ్డ్ ఆఫ్ అయ్యుండొచ్చని బొత్స తెలిపారు. ఈ 113 మంది వివరాలను సేకరించడానికి విస్తృత చర్యలు చేపట్టామని అన్నారు. యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో రాష్ట్రం నుంచి 89 మంది రిజర్వేషన్లు చేసుకున్నట్లు సమాచారం అందినట్లు తెలిపారు. వారిలో విశాఖపట్నం- 33, రాజమండ్రి- 3, ఏలూరు- ఒక్కరు, విజయవాడ- 41, బాపట్ల- 8, నెల్లూరు- ముగ్గురు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇందులో 49 మంది సురక్షితంగా ఉన్నారని, స్వలంగా గాయాలు అయినవారు ఇద్దరు ఉన్నారని బొత్స చెప్పారు. 10 మంది ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారని అన్నారు. మిగిలిన 28 మంది ఫోన్లు ఎత్తట్లేదని, వారి ఫోన్లు స్విచ్డ్ ఆఫ్ అయినట్లు భావిస్తోన్నామని పేర్కొన్నారు. వారి గురించి ఆరా తీస్తోన్నామని, దీనికోసం ప్రత్యేక టీమ్స్ పని చేస్తోన్నాయని అన్నారు.












Click it and Unblock the Notifications