అమృత్ భారత్ రైలులో పురిటి నొప్పులు.. కట్ చేస్తే ఆసుపత్రికి వెళ్ళేలోపే..!
వేగంగా దూసుకెళ్తున్న రైలు.. కళ్లముందు కదులుతున్న పచ్చని పొలాలు.. గమ్యం చేరాలన్న ఆత్రుత.. కానీ, ఆ ప్రయాణంలో విధి మరోలా తలచింది. పార్వతీపురం మన్యం జిల్లాలో అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ సాక్షిగా ఒక అద్భుతం జరిగింది. నిండు గర్భిణి అని కూడా చూడకుండా పురిటి నొప్పులు చుట్టుముట్టగా, తోటి ప్రయాణికుల సహకారంతో ఆ తల్లి రైలులోనే ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మృత్యువుతో పోరాడి గెలిచిన ఆ తల్లి, పసికందు కేకలు రైలు బోగీలో ఆనంద బాష్పాలను నింపాయి.
జార్ఖండ్‌కు చెందిన సప్నా కుమారి తన భర్తతో కలిసి అమృత భారత్ రైలులో ప్రయాణిస్తోంది. ఆమె ప్రస్తుతం ఏడో నెల గర్భిణి. ప్రయాణం సాఫీగా సాగుతుందనుకున్న తరుణంలో, రైలు బొబ్బిలి - పార్వతీపురం స్టేషన్ల మధ్య ఉండగా ఆమెకు అకస్మాత్తుగా ప్రసవ వేదన మొదలైంది. ఆసుపత్రికి వెళ్లే సమయం కూడా లేని స్థితిలో, రైలు వేగంతో పాటే ఆమె గుండె కోత కూడా పెరిగింది. భార్య పడుతున్న అవస్థను చూసి భర్త ఆందోళన చెందగా, రైలులోని తోటి ప్రయాణికులు ఆమెకు అండగా నిలిచారు.

అమృత భారత్‌లో పండంటి బాబు
తీవ్రమైన నొప్పుల నడుమ సప్నా కుమారి రైలులోనే మగపిల్లాడికి జన్మనిచ్చింది. ఏడో నెలలోనే ప్రసవం జరగడంతో కాస్త ఆందోళన నెలకొన్నప్పటికీ, పండంటి బాబు పుట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు తక్షణమే స్పందించారు. పార్వతీపురం చేరుకోగానే రైల్వే సిబ్బంది 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి సిద్ధంగా ఉంచారు.
తల్లీబిడ్డ క్షేమం
రైలు పార్వతీపురం స్టేషన్‌కు చేరుకోగానే అత్యవసర చికిత్స నిమిత్తం తల్లిని, బిడ్డను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రి వైద్యులు వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. "తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. బాబు ఏడో నెలలోనే పుట్టినప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నాడు" అని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆపద సమయంలో స్పందించిన రైల్వే సిబ్బందిని, తోటి ప్రయాణికులను బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications