రఘువీరాపైనే గుర్రు: టిడిపి వైపు ఆనం బ్రదర్స్ చూపు, వైసిపి కోసం బొత్స రాయబారం
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న తమకు పోటీగా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సొంత వర్గాన్ని తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండడం ఆనం సోదరులకు అసలు గిట్టడం లేదని అంటున్నారు. దాంతో వారు కాంగ్రెసు పార్టీ నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. కాంగ్రెసుకు గుడ్ బై చెప్పి వారు తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే, ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి సోదరులను తమ పార్టీలోకి తీసుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకత్వంపై అసంతృప్తితోనే ఆనం సోదరులు పార్టీ మారడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆనం రామనారాయణరెడ్డి బహరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేసారు.

రఘువీరాపై ఆనం సోదరులు తీవ్రంగా మండిపడుతూ వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఏకచత్రాధిపత్యం కోసం రఘువీరా జిల్లాలవారీగా తన వర్గానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారని ఆనం బ్రదర్స్ ఆరోపిస్తున్నారు.
జిల్లా పార్టీలో తమకు ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ పనబాక లాంటి వాళ్లకు అధిక ప్రాముఖ్యం ఇస్తున్నారని ఆనం సోదరులు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ కోసం తాము ఎంతో చేశామని, ఇప్పుడు తాము అవమానాలకు గురి కావాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌పార్టీకి గుడ్‌బై చెప్పాలనుకుంటున్న ఆనం బ్రదర్స్ త్వరలోనే తెలుగుదేశం తీర్ధం పుచ్చుకుంటారని అంటున్నారు. అయితే, వైసీపీలోకి తీసుకెళ్లేందుకు బొత్స రాయభారం నడుపుతున్నారంటూప్రచారం కూడా సాగుతోంది. అయితే ఆనం సోదరులు ఏ పార్టీ జెండాని చేపడతారో అన్నది త్వరలోనే తేలనుంది.












Click it and Unblock the Notifications