అప్పులకెళ్లిన చంద్రబాబు
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టింది. అధికారంలోకి రావడానికి భారీగా హామీలను ఇచ్చిన నేపథ్యంలో వాటిని అమలు చేయడానికి అవసరమైన నిధులను కూడగట్టుకునే ప్రయత్నాల్లో పడింది.
ఇందులో భాగంగా- ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే దశలవారీగా 12,000 కోట్ల రూపాయల విలువ చేసే సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అప్పులకు వెళ్లింది చంద్రబాబు సర్కార్. 1,000 కోట్ల రూపాయల విలువ చేసే మూడు సెక్యూరిటీ బాండ్లను వేలం పెట్టింది.

ఈ నెల 27వ తేదీన ఈ సెక్యూరిటీ బాండ్లు వేలానికి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఇ-కుబేర్) ద్వారా వేలం పాట సాగుతుంది. కాంపిటీటివ్, నాన్ కాంపిటీటివ్ బిడ్స్ రూపంలో వాటిని విక్రయిస్తుంది రిజర్వ్ బ్యాంక్. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ధృవీకరించింది.
ఈ బాండ్ల కాల వ్యవధి ఒకటి- 12, మరొకటి- 17, ఇంకొకటి-22 సంవత్సరాలు. వ్యక్తులు లేదా సంస్థలు వీటిని కొనుగోలు చేయవచ్చు. కాంపిటీటివ్ విధానంలో బాండ్లను కొనదలిచిన వారు ఈ నెల 30వ తేదీన ఉదయం 10:30 నుంచి 11:30 గంటలు, కాంపిటీటివ్ విధానంలో బాండ్లను కొనదలిచిన వారు అదే తేదీన ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య తమ బిడ్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది.
అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం ఈ నెలన్నర రోజుల వ్యవధిలో తన సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టడం ఇది అయిదోసారి ఇదివరకే 12,000 కోట్ల రూపాయల విలువ చేసే బాండ్లను వేలం పాట ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే. తొలుత 3,000 కోట్లు, ఆ తరువాత 5,000 కోట్లు, మూడో విడతలో 2,000 కోట్లు, నాలుగోసారి మళ్లీ 2,000 కోట్ల రూపాయలను ఆర్బీఐ వద్ద రుణాల ద్వారా సేకరించింది.
అయిదో విడతలో మరో 3,000 కోట్ల రూపాయల సమీకరణకు పూనుకుంది. మొత్తం కలిపి 15,000 కోట్ల రూపాయలు రుణభారం రాష్ట్ర ప్రజలపై పడినట్టయింది. ఏపీతో పాటు మరి కొన్ని రాష్ట్రాలు తమ సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టాయి. అస్సాం- రూ.1,000 కోట్లు, బిహార్- రూ. 2,000 కోట్లు, గోవా- రూ.150 కోట్లు, హర్యానా- రూ. 1,000 కోట్లు, జమ్మూ కాశ్మీర్- రూ.400, కేరళ- రూ.3,000 కోట్లు, మధ్యప్రదేశ్- 5,000 కోట్ల రూపాయల మేర బాండ్లను వేలానికి పెట్టాయి.
మహారాష్ట్ర- రూ. 6,000 కోట్లు, మణిపూర్- రూ. 200 కోట్లు, పంజాబ్- రూ. 2,500 కోట్లు, రాజస్థాన్- రూ. 5,000 కోట్లు, తమిళనాడు- రూ. 4,000, పశ్చిమ బెంగాల్- రూ. 3,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ వద్ద ఆక్షన్‌కు పెట్టాయి.












Click it and Unblock the Notifications