రూ. 25,000 కోట్లతో ఏపీ భారీ పాలసీ..: లేపాక్షి, తిరుపతిలో కొత్త సిటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..స్పేస్ టెక్నాలజీపై దృష్టి సారించింది. ఈ రంగంలో భారీ పెట్టుబడులను సాధించాలని నిర్ణయించింది.
ఈ మేరకు స్పేస్ పాలసీపైచంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏపీ స్పేస్ టెక్నాలజీ సలహాదారు, ఇస్రో మాజీ చైర్మన్ సోమ్ నాథ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందులో పాల్గొన్నారు. పలువురు అధికారులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పేస్ టెక్నాలజీ రంగంలో చోటు చేసుకుంటోన్న పురోగతిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

స్పేస్ రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవలని అధికారులను ఆదేశించారు. 25,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు ఆకర్షించేలా ఏపీ స్పేస్ పాలసీ 4.0కి ఆమోదం తెలిపారు.
ఈ సరికొత్త స్పేస్ పాలసీ వల్ల 5,000 నుంచి 8,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. పరోక్షంగా మరో 25,000 నుంచి 30,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా లేపాక్షి, తిరుపతి వద్ద స్పేస్ సిటీని ఏర్పాటు చేయడానికీ చంద్రబాబు ఆమోదం తెలిపారు.
తిరుపతి స్పేస్ సిటీని మాన్యుఫ్యాక్చరింగ్, లాంచ్ లాజిస్టిక్ సేవలు అందించే సంస్థల ఏర్పాటుకు కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. లాంచ్ వెహికల్ అసెంబ్లీ, శాటిలైట్-పేలోడ్ అసెంబ్లింగ్, మెకానికల్ సిస్టమ్-కాంపొనెంట్ మాన్యుఫాక్చరింగ్, ఎలక్ట్రానిక్-ఏవియానిక్స్ అసెంబ్లింగ్ సంస్థలకే ఈ సిటీలో అవకాశం కల్పిస్తారు.
అలాగే వచ్చే దశాబ్ద కాలానికి అంటే 2025- 2035కు సంబంధించి స్పేస్ రంగంలో లక్ష్యాలను రూపొందించాలని ఈ సందర్భంగా చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏపీ స్పేస్ పాలసీలో విద్యార్థులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
కళాశాలలు, అత్యున్నత స్థాయి విద్యా సంస్థలను భాగస్వామ్యులుగా చేయడం వల్ల ఆ దశ నుంచే విద్యార్ధులకు ఈ రంగంపై సమగ్ర అవగాహన కలుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దీనితో పాటు ప్లగ్ అండ్ ప్లే విధానంలో కామన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను అందుబాటులోకి తీసుకుని రావాలని, దీనికోసం అవసరమైతే టెక్నికల్ కమిటీ నియమించాలని ఆదేశించారు.
ఎలక్ట్రానిక్స్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్లకు సంబంధించి టెక్నాలజీ అనుసంధానించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. స్పేస్ సెక్టార్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే సంస్థలకు రాయితీ ఇవ్వాలని అన్నారు. దీనికి అవసరమైన శ్లాబ్ ల గురించి ఆయన ప్రస్తావించారు.
కోటి నుంచి రూ.2.5 కోట్ల వరకు మైక్రో, రూ.2.5 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు స్మాల్, రూ.25 కోట్ల నుంచి రూ.125 కోట్ల వరకు మీడియం, రూ.125 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు లార్జ్ స్కేల్ కేటగిరీల కంపెనీలుగా విభజించాలని, ఏ కేటగిరీకి ఆ కేటగిరీగా రాయితీలు ప్రత్యేకంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.
500 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టే సంస్థలను మెగా కేటగిరీ కింద పరిగణించాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్బంగా సోమ్ నాథ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న స్పేస్ విధానాల గురించి వివరించారు. స్టార్ లింక్, స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజన్ వంటి ప్రైవేట్ ఆపరేటర్లు ఈ రంగంలో రాణిస్తోన్నారని వివరించారు.












Click it and Unblock the Notifications