రేపే ఏపీ బడ్జెట్- జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. పూజలు
ఏపీ కేబినెట్ గురువారం ఉదయం భేటీ కానుంది. బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనుంది. అనంతరం ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. వాటిని సభలో ప్రవేశపెట్టనున్నారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. సభా కార్యకలాపాలను అడ్డుకున్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన 12 మంది సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారం సస్పెండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపైనా వేటు వేశారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. మిగిలిన వారు ఒకరోజు పాటు సస్పెండ్ అయ్యారు.

బడ్జెట్ రేపే..
కీలకమైన బడ్జెట్ ప్రతిపాదనలను ప్రభుత్వం గురువారం సభలో ప్రవేశపెట్టనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 2.60 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గత ఏడాది కంటే కూడా ఈ దఫా కేటాయింపులు భారీగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. సంక్షేమ పథకాలకు అధిక మొత్తంలో కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసిన ప్రభుత్వం- ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పింఛన్ కోసం..
పింఛన్ మొత్తాన్ని కూడా 3,000 రూపాయలకు పెంచాల్సి ఉన్నందున దీనికి అనుగుణంగా బడ్జెట్ లో కేటాయింపులు ఉండొచ్చు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు బడ్జెట్ లో ప్రాధాన్యతలు ఉంటాయని తెలుస్తోంది. నాడు-నేడు, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన.. వంటి పథకాలను అమలు చేస్తోన్నందున విద్యారంగానికి బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు ఉంటాయని అంటున్నారు. వ్యవసాయం, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, వైద్య కళాశాలల నిర్మాణానికి మరిన్ని నిధులను కేటాయిస్తారని చెబుతున్నారు.

వ్యవసాయం.. మైనారిటీ..
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్ ప్రతిపాదనలను సభకు సమర్పిస్తారు. శాసనమండలిలో ఆర్ధిక బడ్జెట్ ను ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, వ్యవసాయ బడ్జెట్ ను సీదిరి అప్పలరాజు శాసన మండలిలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రతిపాదలను సమర్పించిన అనంతరం అసెంబ్లీ వాయిదా పడే అవకాశం ఉంది.

ఏపీ కేబినెట్..
ఏపీ మంత్రివర్గం ఉదయం 8 గంటలకు సమావేశం కానుంది. బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదిస్తుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ఉదయం 7:30 గంటలకు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆయన మంత్రివర్గ సమావేశానికి హాజరవుతారు. కేబినెట్ ఆమోదం పొందిన అనంతరం అసెంబ్లీలో వాటిని ప్రవేశ పెడతారు.












Click it and Unblock the Notifications