దసరా నుంచి మహిళలకు ఊహించని గిఫ్ట్ ఇవ్వబోతున్న చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధినేత పలు హామీలను ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. పింఛను పెంచి రూ.4వేలు అందిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులచేత ఒక్కరోజులోనే పంపిణీ చేయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 అన్న క్యాంటిన్లను ప్రారంభించారు. తాజాగా మరో రెండు పథకాలను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతోపాటు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ప్రకటించారు.
దసరా నుంచి ఉచిత ఆర్టీసీ ప్రయాణం
ఈ ఏడాది విజయ దశమి నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి అధికారులు సాధ్యాసాధ్యాలను విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతుండగా, అధికారులు దీనిపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఈ పథకాన్ని విశాఖపట్నంలో ప్రారంభించే అవకాశం ఉంది. ఉచితంగా మహిళలు ప్రయాణించడంవల్ల ఆర్టీసీకి ఎంత నష్టం వస్తుందనేది అంచనా వేశారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఆ నష్టాన్ని భరాయిస్తుంది. ఆమేరకు నగదును ఆర్టీసీకి చెల్లిస్తుంది.

దీపావళి నుంచి మూడు సిలిండర్లు
అలాగే దీపావళికి మూడు గ్యాస్ సిలిండర్లను ఇవ్వబోతున్నారు. తెల్ల రేషన్ కార్డుదారులంతా ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీ కేంద్రాలకు వెళ్లి ఈకేవైసీ చేయించుకుంటున్నారు. చేయించుకోనివారుంటే వెంటనే చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్లి ఆధార్ కార్డు చూపించి వేలిముద్ర వేస్తే చాలు. ఈ కేవైసీ అయిపోతుంది. రెండు పండుగలు ఈ నెలలోనే ఉండటంతో దసరాకు ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని, దీపావళికి మూడు సిలిండర్లను మహిళలకు బహుమతిగా ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహిళలకు భారీ కానులను తమ అధినేత ఇవ్వబోతున్నాడని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఊరూవాడా చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications