Mangalagiri:మంగళగిరిలో అద్భుత క్షేత్రం-పానకం స్వీకరించి గుటక వేసే దేవుడు..!!
Mangalagiri Panakala Swamy Temple:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరి పట్టణంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భక్తులకు ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, అనేక వింతలు విశేషాలకు నిలయం. ఇక్కడ కొలువై ఉన్న నరసింహ స్వామిని పానకాల స్వామి అని పిలుస్తారు. భక్తులు స్వామికి పానకం సమర్పించడం ఇక్కడి ప్రత్యేక ఆచారం. ఈరోజు (గురువారం) మంగళగిరి పానకాల స్వామి కల్యాణోత్సవం. ఈ నేపథ్యంలో ఒకసారి ఆ ఆలయ విశిష్టతను,రహస్యం గురించి తెలుసుకుందాం.
స్వామి గుటక వేసిన శబ్దం..కనిపించని చీమలు
స్థానికుల కథనం ప్రకారం మంగళగిరి ఒకప్పుడు అగ్నిపర్వతం. అందుకే, ఇక్కడ స్వామికి పానకం పోసి శాంతిపజేయడం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాదు పానకాల స్వామికి పానకం సమర్పించినప్పుడు, ఆ పానకాన్ని స్వామి గుటక వేసిన శబ్దం స్పష్టంగా వినిపిస్తుందట. ఇది భక్తులకు మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది.

పానకాల స్వామి ఆలయంలో మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రతిరోజు ఎంతో పానకం స్వామికి సమర్పించినప్పటికీ, గర్భగుడిలో ఒక్క చీమ కానీ, ఈగ కానీ కనిపించకపోవడం. ఇది భక్తులను ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ దృగ్విషయం వెనుక గల శాస్త్రీయ కారణాలను తెలుసుకోవడానికి అనేకమంది ప్రయత్నించినా, నేటికీ ఇది ఒక రహస్యంగానే మిగిలిపోయింది.ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రోజున మంగళగిరి పానకాల స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తారు.
కలియుగంలో బెల్లపు పానకం
మంగళగిరి క్షేత్రానికి పురాణ ప్రాముఖ్యత కూడా ఉంది. శ్రీ మహా విష్ణువు కోసం శ్రీ లక్ష్మి దేవి ఇక్కడ తపస్సు చేసిందని పురాణాలు చెబుతున్నాయి.మంగళగిరిలో మూడు నరసింహ స్వామి ఆలయాలు ఉండటం విశేషం.కొండ దిగువన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం,కొండపైన పానకాల స్వామి ఆలయం,కొండ శిఖరాన గండాల నరసింహ స్వామి ఆలయం ఉన్నాయి.చరిత్ర ప్రకారం, మంగళాద్రి నృసింహునికి కృత యుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవునెయ్యిని, ద్వాపర యుగంలో ఆవుపాలను సమర్పించారు.కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు.పానకాల స్వామి ఆలయంలో స్వామి ముఖం మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది.అది కూడా నోరు తెరిచిన రూపంలో ఉంటుంది.భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని ఆ నోటిలో పోస్తారు.సగం పానకం పోయగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. ఆ తరువాత పానకం పోయడం ఆపి, మిగిలిన పానకాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.
నేతితో గండదీపాలు
పానకాల స్వామి ఆలయానికి వెనుక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. కొండ శిఖరాన గండాల నరసింహ స్వామి మందిరం ఉంది. ఇక్కడ విగ్రహం ఉండదు. ఎటువంటి ఆపదలు సంభవించినా, వాటి నుండి విముక్తి పొందడానికి భక్తులు గండాల నరసింహ స్వామికి నేతితో కానీ, నూనెతో కానీ గండ దీపాలు వెలిగిస్తారు.స్థల పురాణం ప్రకారం, పాండవులు కొండ కింద శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని, మెట్ల మార్గంలో భ్రమరాంబా మల్లికార్జున స్వామిని ప్రతిష్టించారు. మంగళగిరి క్షేత్రం ఆధ్యాత్మిక చింతనతో పాటు ప్రకృతి రమణీయతను కూడా కలిగి ఉంది. ఈ క్షేత్రాన్ని సందర్శించడం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications