అదొక్కటి వైఎస్ జగన్ వద్దంటే.. అదే కావాలన్న ప్రజలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాస్తా మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో 151 సీట్లతో తిరుగులేని ఆధిపత్యం చెలాయించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆరునెలల్లోపే మూడు రాజధానులంటూ గేమ్ ఆడారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని, అమరావతి అంటే కేవలం ఒక సామాజికవర్గానిదేనన్నారు. కర్నూలు, విశాఖపట్నం, అమరావతి న్యాయ, కార్యనిర్వాహక, శాసన రాజధానులగా కొనసాగుతాయన్నారు. దీన్ని నిరసిస్తూ అమరావతి రైతులు నాలుగున్నర సంవత్సరాలపాటు దీక్షలు కొనసాగించారు.
పరదాలు అడ్డుగా కట్టేవారు
రాజధాని పరిధిలోకి వచ్చే 29 గ్రామాల పరిధిలో ప్రతి గ్రామంలో రైతులు నిరసనగా దీక్షలు చేపడితే ఆ గ్రామాలమీదుగానే శాసనసభకు, అసెంబ్లీకి వెళ్లాల్సిన మాజీ ముఖ్యమంత్రి జగన్ దీక్షా శిబిరాలవద్ద భారీగా పోలీసులను మొహరింపచేయడంతోపాటు పరదాలను అడ్డుగా పెట్టించేవారు. రైతులను కలవడానికి ఏనాడూ సుముఖత వ్యక్తం చేయలేదు. రైతులపై లాఠీఛార్జి జరిగింది.. పోలీసులతో ఒకరకంగా వారిపై దాష్టీకం చెలాయించారు. అన్నింటినీ భరించిన రైతులు ఓర్పుగా ఎదురుచూశారు.

అధికారంలోకి కూటమి
వారి కోరిక నెరవేరింది. అమరావతిని రాజధానిగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా అమరావతిలోనే చేయబోతున్నారు. దీనిపై రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు అందించిన ఘన విజయాన్ని పరిశీలిస్తే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని వైఎస్ జగన్ తీర్చిదిద్దడాన్ని జీర్ణం చేసుకోలేకపోయినట్లు అర్థమవుతోంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడి బయటకు వచ్చినప్పుడు కర్నూలు రాజధాని అన్నారు.
మహానగరంగా తీర్చిదిద్దాలని..
హైదరాబాద్ అయితే బాగుంటుందని పాలకులు సూచన చేస్తే కర్నూలు ప్రజలు అంగీకరించడంతో తెలుగువారి కలల రాజధానిగా హైదరాబాద్ ఈరోజు మనం చూస్తున్న స్థాయికి ఎదిగింది. తిరిగి కాంగ్రెస్ పార్టీ బలవంతంగా రాష్ట్ర విభజనకు పాల్పడటంతో హైదరాబాద్ ను పోగొట్టుకొని ఒట్టి చేతులతో ఏపీ మిగలాల్సి వచ్చింది. తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సహకారాన్ని అందించడంలో మొండిచెయ్యి చూపించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమకు, ఉత్తరాంధ్రకు మధ్యలో ఉంటుందనే ఉద్దేశంతో అమరావతి గ్రామాన్ని ఎంపిక చేశారు. దీనికి రెండువైపులా గుంటూరు, విజయవాడతోపాటు కొద్దిదూరంలోనే మంగళగిరి కూడా ఉంది.
జీర్ణించుకోలేని ప్రజలు
అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేయగలిగితే గుంటూరు, విజయవాడ కలిసిపోయి మహానగరంగా రూపుదిద్దుకుంటుందని, హైదరాబాద్ లాంటి మహానగరాన్ని పోగొట్టుకున్నామనే బాధ తెలుగువారిలో తగ్గుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు అమరావతిని ఎంపిక చేస్తే వైఎస్ జగన్ తన కుత్సిత రాజకీయాలతో రాజధాని రాష్ట్రంగా ఏపీని మార్చడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. చివరకు 12 నుంచి 14 స్థానాలకు పరిమితం కావాల్సి వస్తోంది. (ఫలితాలు వెల్లడయ్యే సమయానికి).












Click it and Unblock the Notifications