జగన్ చుక్కాని: ఏపీ సరికొత్త రికార్డులు- సౌత్‌లోనే టాప్ స్టేట్..!!
అమరావతి: ఏపీలో జీఎస్టీ వసూళ్లు దుమ్ము దులుపుతున్నాయి. ఏనెలకానెల భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందుతున్నాయనడానికి ఈ జీఎస్టీ వసూళ్లే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లోనే అగ్రస్థానంలో నిలిచింది.. ఏపీ.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపు రాష్ట్రాభివృద్ధికి చుక్కానిలా మారినట్టయింది. రాజధాని నగరం అంటూ ఏదీ లేకపోయినప్పటికీ- అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తోన్న వికేంద్రీకరణ విధానం వల్లే ఇది సాధ్యపడింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతికి అధికారం అందే సమయానికి రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందనే విషయం అందరికీ తెలిసిందే. వంద కోట్ల రూపాయలు మాత్రమే ఖజనాలో ఉన్నాయంటూ అప్పటి ఆర్థికమంత్రి సైతం ప్రకటించారు. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వైఎస్ జగన్.. రాష్ట్ర ఆదాయాన్ని ఎన్నో రెట్లు రెట్టింపు చేయగలిగారనడానికి జీఎస్టీ వసూళ్లే నిదర్శనం.
తన పన్నుల ఆదాయం పెంపొందించుకుని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి జగన్ అనుసరిస్తోన్న విధానాలు దీనికి దోహదపడుతున్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న వ్యాపార వాణిజ్య, పారిశ్రామిక విధానాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.
సులభతరం వాణిజ్య విధానాలు అమలు చేయడంలోనూ, దేశీయ విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో వైఎస్ జగన్ సారధ్యంలోని ఆంధ్రప్రదేశ్ గొప్ప ప్రగతి సాధించినట్లు కేంద్రం విడుదల చేసిన నివేదికల్లో ఇప్పటికే వెల్లడైంది. అక్టోబర్ 2023 వరకు జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటులో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నాయి.

రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ ఆదాయం 12 శాతం వృద్ధి రేటుతో 18,488 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇక దక్షిణాది రాష్ట్రాలయిన కర్ణాటక- 12 శాతం వృద్ధి రేటుతో ఆంధ్రతో సమానంగా నిలిచింది. తెలంగాణ- 10, తమిళనాడు- 9, కేరళ- 5 శాతం వృద్ధి రేటును నమోదు చేశాయి.
దేశ వ్యాప్తంగా అక్టోబర్‌లో స్థూల జీఎస్టీ ఆదాయం 1,72,003 కోట్లుగా ఉంది. ఈ మొత్తంలో 30,062 కోట్ల రూపాయలు సెంట్రల్ జీఎస్టీ, 38,171 కోట్ల రూపాయలు స్టేట్ జీఎస్టీ. 91,315 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 42,127 కోట్లతో కలిపి) ఐజీఎస్టీ, రూ.12,456 కోట్లు (రూ. 1,294 కోట్లతో సహా) వస్తువుల దిగుమతిపై వసూలయ్యాయి.
మొత్తం మీద చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పన్నుల ఆదాయంలో దూసుకుపోతోంది దీనికి సీఎం వైఎస్ జగన్ సారధ్యంలోని ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణలు, పారదర్శక విధానాలే కారణమని నిపుణులు అంటున్నారు. ఆయన అనుసరిస్తోన్న ఆర్థిక విధానాలే దీనికి కారణమని స్పష్టం చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications