90 మండలాల్లో రెడ్ అలర్ట్, అటు వడగాల్పులు.. ఇటు వర్షాలు..
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా గందరగోళంగా మారింది. మార్చి నెల ముగియకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండగా, మరోవైపు వాతావరణ శాఖ వర్ష సూచన కూడా జారీ చేసింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించగా, కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాష్ట్రంలోని తొమ్మిది మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 32 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉంది.

తీవ్ర ప్రభావం చూపే జిల్లాలు:
పార్వతీపురం మన్యం (గుమ్మలక్ష్మీపురం, కురుపాం), పోలవరం (చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం), కాకినాడ (జగ్గంపేట), తూర్పుగోదావరి (కోరుకొండ), ఎన్టీఆర్ జిల్లా (జి.కొండూరు, ఇబ్రహీంపట్నం).
ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, పల్నాడు, విజయనగరం తదితర జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. శనివారం నాటికి వడగాలుల ప్రభావం ఏకంగా 90 మండలాలకు విస్తరించవచ్చని అంచనా వేస్తున్నారు.
ఈదురుగాలులతో కూడిన వర్ష సూచన
ఎండల తీవ్రత ఇలా ఉండగా, వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా గంటకు 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
వర్షాలు కురిసే జిల్లాలు:
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం ఇప్పటికే ఉత్తరాంధ్ర మరియు ప్రకాశం జిల్లాల్లో జల్లులు కురిశాయి.
ప్రజలకు సూచనలు..
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు మరియు చిన్న పిల్లలు ఎండ దెబ్బ తగలకుండా అప్రమత్తంగా ఉండాలని, సరిపడా నీరు తాగాలని కోరారు. రైతులు తమ పంట కోతల విషయంలో వాతావరణ హెచ్చరికలను గమనించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications