ఏపీకి తుఫాను ముప్పు..? బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం మారనుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలతో పాటు తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే వీలుండటంతో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం గత కొన్ని గంటలుగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. ఇది ఒడిశాలోని బారిపడకు సమీపంలో కేంద్రీకృతమై ఉండి, రాబోయే 24 గంటల్లో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనించే అవకాశముందని అధికారులు తెలిపారు. దీనికి తోడు సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి తీవ్ర వాయుగుండం కేంద్రం గుండా ఈశాన్య బంగాళాఖాతం వైపు సాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్ష సూచనలు కనిపిస్తున్నాయి.

ఉత్తర కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
వాయుగుండం ప్రభావం ఉత్తర కోస్తా జిల్లాలపై స్పష్టంగా ఉండనుంది. ఈ రోజ, రేపు ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉంది. ఎల్లుండి కూడా పలుచోట్ల జల్లులు కురుస్తాయని, తీర ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో పరిస్థితి ఇలా...
దక్షిణ కోస్తాంధ్రలో ఈ రోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురవచ్చు. రాయలసీమ జిల్లాల్లో రాగల మూడు రోజుల పాటు ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. వర్షాలతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ రెండింటిలోనూ గంటకు 40-50 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశముంది.
తీవ్రమైన ఉక్కపోత... ప్రజలకు సూచనలు
వర్షాలు కురుస్తున్నప్పటికీ వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా వేడి, తీవ్రమైన ఉక్కపోత పరిస్థితులు నెలకొంటాయని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది.














Click it and Unblock the Notifications