పావులు కదుపుతున్న YCP... సందిగ్ధంలో TDP.. రమ్మంటున్న BJP?
ఎన్నికల సమయానికి కనీసం 30 మందికైనా టికెట్లిచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని ముఖ్యమంత్రి జగన్ అంచనా వేస్తున్నారు.
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కొన్ని పరిణామాల మధ్య సతమతమవుతోంది. అధికార వైసీపీని ఒక పక్క ఢీకొడుతూనే మరోవైపు పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిసారించింది. ఇప్పటికే 157 నియోజకవర్గాల సమీక్షలు పూర్తిచేసిన పార్టీ అధినేత చంద్రబాబు మిగతావి కూడా త్వరలోనే పూర్తిచేయబోతున్నారు. 2024లో కచ్చితంగా తాము అధికారంలోకి వస్తామనే నమ్మకంతో ఆ పార్టీ ఉంది.

కనీసం 30 మందైనా ఉంటారు
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువకాని ప్రజాప్రతినిధులు, పర్యటనలు జరపనివారికి రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి జగన్ ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. ప్రతి నెలా వారి పనితీరు ఎలా ఉందనే విషయమై సమీక్షలు చేస్తున్న జగన్ ఎన్నికల సమయానికి కనీసం 30 మందికైనా టికెట్లిచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఎవరెవరికి టికెట్ దక్కదనే అనుమానం ఉందో.. వారంతా ఇప్పటినుంచే పక్కచూపులు చూస్తున్నారు.

అంతిమ లాభం వైసీపీకే?
అటువంటి నాయకులకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం, జనసేన కనపడుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి అండగా నిలుస్తామని, తమ పార్టీలోకి రావాలని ఏపీ బీజేపీ నేతలు కోరుతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతోంది. పార్టీ తరఫున ఏ నిర్ణయం తీసుకోకపోతే వారంతా బీజేపీవైపు వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల తెలుగుదేశం, వైసీపీ మధ్య జరిగే పోరులో ఆనం, కోటంరెడ్డి లాంటి బలమైన నాయకులైతే ఓట్లు చీలుస్తారని, అంతిమంగా వైసీపీకి లాభం కలుగుతుందని అంచనా వేస్తోంది.

పావులు కదుపుతున్న వైసీపీ
వైసీపీ కూడా తమ పార్టీ నుంచి వెళ్లినవారు టీడీపీలో చేరకుండా బీజేపీలో చేరితేనే మంచిదనే యోచనలో ఉంది. దీనివల్ల బీజేపీ కాస్తో కూస్తో బలపడి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేంతస్థాయికి ఎదిగితే చాలు అని వైసీపీ వర్గాలంటున్నాయి. జయమంగళ వెంకటరమణ లాంటివారిని గుర్తించి వైసీపీలో చేర్చుకోవడానికి ఆ పార్టీ ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించింది. జనసేనతో పొత్తుంటున్న నేపథ్యంలో టికెట్ల విషయంలో ముందుగానే వైసీపీ నుంచి అడుగుతున్న నేతలకు హామీ ఇవ్వలేక టీడీపీ సతమతమవుతోంది. తాము కాదంటే వారు బీజేపీలో చేరేలా ఉన్నారు. అలా చేరకుండా ఉండాలంటే టీడీపీలోకి ఆహ్వానించడంతోపాటు పార్టీలో ఉన్న నేతలకు కూడా సర్దిచెప్పాల్సి ఉంటుంది. ఇటువంటి సందిగ్ధావస్థలో ఉన్న టీడీపీ బలహీనతను వైసీపీ క్యాష్ చేసుకునేలా పావులు కదుపుతోంది.












Click it and Unblock the Notifications