TTD: నేటి నుంచి కార్తీక బ్రహ్మోత్సవాలు - ఈ సారి ప్రత్యేకత..!!
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఇందు కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసిది. ఈ బ్రహ్మోత్సవాలు ఈ రోజు (నవంబరు 28) నుంచి డిసెంబరు 6వతేదీ జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి ఈవో శ్యామల రావు చెప్పారు. ఈ సారి ప్రత్యేకతలను వెల్లడిం చారు. భక్తుల రద్దకి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు.
సర్వం సిద్దం
తిరుచానూరు బ్రహ్మోత్సవాల కోసం టిటిడిలోని అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. ఆలయ పరిసరాలలో చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీ కేడ్లు, అమ్మవారి ఆలయం, మాడ వీధుల్లో శోభాయమానంగా విద్యుత్ అలంకరణలు చేసారు. బ్రహ్మోత్సవాలను భక్తులు వీక్షించేందుకు వీలుగా తిరుచానూరు పరిసర ప్రాంతాలతో పాటు, పద్మ పుష్కరిణికి నాలుగు వైపులా ఈసారి మొత్తం 20 ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశామన్నారు.
పంచమి తీర్థం సందర్భంగా డిసెంబరు 5వ తేదీ సాయంత్రం నుండి భక్తులు వేచి ఉండేందుకు తిరుచానూరు పరిసర ప్రాంతాలైన జడ్పీ హైస్కూల్, పూడి రోడ్డు, నవజీవన్, తిరుచానూరు గేటు వద్ద 4 హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు.

భక్తుల కోసం
ఇందులో మొత్తం 120 కౌంటర్ల ద్వారా దాదాపు 50 వేలకు పైగా భక్తులకు తాగునీరు, బాదంపాలు, బిస్మిల్లా బాత్, పెరుగు అన్నం, విజిటబుల్ ఉప్మాతో పాటు ఈసారి అదనంగా చెక్కెర పొంగలి అందించనున్నట్లు తెలియజేశారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు రోజుకు 10 వేల మందికి సాంప్రదాయ బద్ధంగా అన్నం, పప్పు, సాంబారు, రసం, స్వీట్ తో పాటు ఈ సారి అదనంగా కర్రీని అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు. అమ్మవారి వాహన సేవలను ఎస్వీబీసీలో హెచ్‌డి క్యాలిటితో ప్రత్యక్ష ప్రసారాలతో పాటు, ఎస్వీబీసీ ఆన్ లైన్ రేడియో, యూట్యూబ్ ద్వారా కూడా ప్రసారాలు అందిస్తామన్నారు.
శోభాయాత్ర
అమ్మవారి వాహన సేవలో ఏడు రాష్ట్రాల నుండి కళాబృందాలు, అలిపిరి నుంచి తిరుచానూరు వరకు నిర్వహించే శ్రీపద్మావతి అమ్మవారి సారె శోభయాత్రలో 1000 మంది కళాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. బ్రహోత్సవాల్లో రోజుకు 300 మంది, పంచమితీర్థం రోజున 600 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో టిటిడి భద్రతా సిబ్బంది, పోలీసులతో కలిపి 460 మంది, పంచమి తీర్థం రోజున 1500 మంది పోలీసులు, 600 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. బ్రహోత్సవాల రోజుల్లో 500 మంది, పంచమితీర్థం రోజు 1000 మంది శ్రీవారి సేవకులు, 200 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు సేవలందిస్తారన్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన డిసెంబరు 6వ తేదీ పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని వివరించారు.












Click it and Unblock the Notifications