జగన్‌కు ఆ ఓటుబ్యాంకే అండ: ఈ జిల్లాలపై తాజా సర్వే నివేదిక
Andhra Assembly elections 2024: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దూకాయి. ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోవడానికి సన్నద్ధమౌతున్నాయి. దీనికి అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోన్నాయి. ప్రచార కార్యక్రమాల్లో తల మునకలవుతున్నాయి.
ప్రచార హోరు..
ఇదివరకే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం బహిరంగ సభలతో జనంలోకి చొచ్చుకెళ్లింది. మలిదశలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 27వ తేదీన మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను చేపట్టనున్నారు. 175 నియోజవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు.

పోటాపోటీ..
అటు తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి కూడా బహిరంగ సభలతో జనం ముందుకు వచ్చింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి సభలో సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. దీని తరువాత మలి విడత బహిరంగ సభలపై కసరత్తు సాగిస్తోంది కూటమి.
లేటెస్ట్ సర్వే..
ఈ పరిస్థితుల మధ్య- ప్రముఖ సెఫాలజిస్ట్, ఎన్నికల సర్వే సంస్థ చాణక్య ప్రతినిధి పార్థా దాస్.. ఏపీ ఎన్నికలపై సర్వే నిర్వహించారు. వాటి ఫలితాలను వెల్లడించారు. రెండు జిల్లాల ఓటర్ల మనోగతంతో కూడుకున్న సర్వే రిపోర్ట్ ఇది. ఉమ్మడి తూర్పు గోదావరి, కడప జిల్లాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల అభిప్రాయాన్ని క్రోడీకరించి ఈ నివేదికను రూపొందించారు.
తూర్పు గోదావరిలో..
తూర్పు గోదావరి జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని అంచనా వేశారు పార్థా దాస్. ఇక్కడ తెలుగుదేశం కూటమి పట్టు పట్టు సాధిస్తుందని పేర్కొన్నారు. టీడీపీ- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి 12 నుంచి 13 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్సీపీ 6 నుంచి 7 సీట్లను గెలుచుకుంటుందని చెప్పారు.
ఓట్ల శాతం ఎలా..
తూర్పులో వైఎస్ఆర్సీపీకి 47.5 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయి. టీడీపీ కూటమికి 52.3 శాతం మేర ఓట్ల పడతాయి. పురుష ఓటర్లల్లో టీడీపీకి 53.0 శాతం మంది జై కొట్టారు. 45.6 శాతం మంది వైసీపీ వైపు మొగ్గు చూపారు. మహిళా ఓట్లు మాత్రం వైసీపీకే పడతాయి. ఈ సర్వే ప్రకారం చూస్తే- వైసీపీకి 52.6 శాతం మంది, టీడీపీకి 46.3 శాతం మహిళలో ఓటు వేస్తారు.
కడపలో..
వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో వైఎస్ఆర్సీపీ భారీ ఆధిక్యత సాధిస్తుంది. జిల్లాలో 9 నుంచి 10 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగలుగుతుంది. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఇక్కడ ఖాతా తెరవలేకపోవచ్చు. తెరిచినా ఒక్క సీటుకే పరిమితం కావొచ్చని పార్థా దాస్ సర్వే తెలిపింది.
భారీ ఓట్ల శాతం..
వైఎస్ఆర్సీపికి ఇక్కడ భారీగా ఓట్లు పోల్ అవుతాయి. ఆ పార్టీ సాధించే ఓట్ల శాతం 53.9 శాతంగా నమోదైంది. పురుషులు- 50.1, మహిళలు 65.7 శాతం మేర ఓటు వేస్తారు. టీడీపీ కూటమికి పడే ఓట్లు 46.0 శాతం. ఇందులో పురుష ఓటర్ల శాతం 50.1, మహిళా ఓట్లు 33.9 శాతంగా రికార్డయినట్లు పార్థా దాస్ సర్వే అంచనా వేసింది.
ఓటుబ్యాంక్..
ఈ రెండు జిల్లాల సర్వే రిపోర్ట్‌లో కామన్ పాయింట్.. మహిళల ఓటుబ్యాంక్. టీడీపీ కూటమి ఆధిక్యత సాధించిన తూర్పు గోదావరి జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీకి మహిళల ఓట్ల శాతం అధికంగా ఉన్నట్లు తేలింది ఇందులో. అమ్మఒడి, జగనన్న చేదోడు, వైఎస్సార్ చేయూత, విద్యాదీవెన, ఇంటి వద్దకే పథకాల లబ్దిని అందజేయడం.. వంటి పథకాలు వైసీపీ మహిళా ఓటుబ్యాంకును చెక్కుచెదరనివ్వలేదు.












Click it and Unblock the Notifications