ప్రశ్నించేవాడే ప్రశ్నగా మారాడు, అభిమానుల్ని రెచ్చగొడతారా?: పవన్ కళ్యాణ్‌పై ఫైర్
హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ శాసన సభ హక్కులను కాలరాస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్లజ్జగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, దీనిని ప్రశ్నించేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు నోరు ఎందుకు పెగలడం లేదని ఏపీ బీసీ సంఘం అధ్యక్షులు ఉదయ్ కిరణ్ ప్రశ్నిచారు.
ప్రశ్నించేవాడు ప్రశ్నగా మారితే జనం తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలన్నారు. సినిమా డైలాగులు చెప్పే పవన్ కళ్యాణ్ జనాలకు చేసేదేమీ లేదని మండిపడ్డారు. అభిమానాన్ని ఆసరాగా తీసుకొని యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్‌ది నిలకడ లేని మనస్తత్వమని ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తనకే తెలియదన్నారు. అభిమానులను మోసం చేస్తే వారే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఏపీలో ప్రజలు అనేక సమస్యలతో అవస్థలు పడుతున్నా పవన్ కళ్యాణ్ ఒక్క దాని పైన కూడా పోరాడలేదన్నారు.

కాగా, ఇటీవల ఏపీలో పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే డజనుకు పైగా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. మరో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు.
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ బీసీ సంఘం అధ్యక్షులు డేరంగుల ఉదయ్ కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications