ఏపీలో ఆడబిడ్డ నిధి ఎప్పటి నుంచి ఇస్తారండీ
Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఘాటు విమర్శలు సంధించింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరేలా కనిపించట్లేదని పేర్కొంది.
ఈ బడ్జెట్‌పై తాజాగా వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యురాలు వరుదు కళ్యాణి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై పలు విమర్శనాస్త్రాలను సంధించారు. ఈ మధ్యాహ్నం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె బడ్జెట్ కేటాయింపులపై మాట్లాడారు. ఈ ఏడాది బడ్జెట్ రాష్ట్ర ప్రజలను పూర్తిగా నిరాశపరిచిందని అన్నారు.

తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు నిధుల కేటాయింపుల్లో భారీగా కోత విధించారని వరుదు కళ్యాణి తప్పుపట్టారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రగా ఉండి ఉంటే ఇప్పటికే అమ్మ ఒడి డబ్బులు అందేవని, రైతు భరోసా సాయం చేసేవారని పేర్కొన్నారామె. ఈ బడ్జెట్‌లో రైతు భరోసాకు కంటి తుడుపు చర్యగా నిధులు కేటాయించారని విమర్శించారు.
దీపం పథకాన్ని 90 లక్షల మందికే కుదించారని వరుదు కల్యాణి విమర్శించారు. సున్నా వడ్డీకి నిధులే లేవని అన్నారు. ధరల స్థిరీకరణ నిధికి 300 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని, ఇవి ఏ మాత్రం సరిపోవని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ మొత్తం అంకెల గారడీగానే కనిపిస్తోందని వరుదు కళ్యాణి అభివర్ణించారు.
కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీ ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసే వరకు పోరాడుతూనే ఉంటామని వరుదు కళ్యాణి హెచ్చరించారు. ఈ పథకంపై శాసన మండలిలో పార్టీకి చెందిన తోటి ఎమ్మెల్సీ మంగమ్మతో కలిసి వాయిదా తీర్మానం ఇచ్చారు. మండలి చైర్మన్ ఈ తీర్మానాన్ని తిరస్కరించడంతో మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు.
సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకానికి వరుసగా రెండు బడ్జెట్‌లల్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదంటూ వరుదు కల్యాణి విమర్శించారు. ఈ పథకానికి కోటి 50 లక్షల మంది అర్హులు ఉన్నారని, సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని వివరించారు. బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళ పక్షపాతిగా తన ప్రభుత్వ హయాంలో ఎన్నో సంస్కరణలు చేశారని ఆమె గుర్తు చేశారు. వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, ఆసరా వంటి పథకాలు ప్రవేశ పెట్టి అడబిడ్డలను ఆదుకున్న ఘనత జగన్‌దేనని అన్నారు. ఆడబిడ్డ నిధికి నిధులు కేటాయించకుండా చంద్రబాబు మహిళ ద్రోహిగా నిలిచారని వరుదు కళ్యాణి మండిపడ్డారు.












Click it and Unblock the Notifications