కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై సస్పెన్షన్ - సభలో గందరగోళం..!!
అసెంబ్లీ నుంచి ఇద్దరు టీడీపీ సభ్యులతో పాటుగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఈ సమావేశాల వరకు సస్పెండ్ చేసారు.
ఏపీ అసెంబ్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ నుంచి ఇద్దరు టీడీపీ సభ్యులతో పాటుగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఈ సమావేశాల వరకు సస్పెండ్ చేసారు. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యే ల ను ఈ రోజు సమావేశాల వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఉదయం సమావేశాలకు హాజరవుతున్న సమయం నుంచి సభలోనూ కోటంరెడ్డి నిరసన కొనసాగించారు. మధ్యలో గవర్నర్ శాసనసభకు వచ్చిన సమయంలో ప్రభుత్వం ఆయన్ను వేచి చూసేలా వ్యవహరించిందనే ఆరోపణలు..పత్రికల్లో వచ్చిన వార్తల పైన ప్రభుత్వం సీరియస్ అయింది. అసత్య ప్రచారం చేసినందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

గవర్నర్ కు ఆహ్వానంపై అసత్య ప్రచారం
టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యల పైన మంత్రులు నిలదీసారు. గవర్నర్ వచ్చిన సమయంలో ఏం జరిగిందో సభలో వివరించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను రిసీవ్ చేసుకోవడంలో ప్రొటోకాల్ పాటించలేదంటూ టీడీపీ మద్దతు మీడియా ప్రచరాన్ని అసెంబ్లీ వేదికగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ వెళ్లి.. గవర్నర్‌కి ఘనస్వాగతం పలికి.. సభలోకి తీసుకువచ్చారని ఆధారాలతో సహా తెలియజేశారు. ప్రోటోకాల్ పాటించలేదుని, సీఎం కోసం గవర్నర్ వేచి ఉన్నారంటూ ఎల్లో పత్రికలు నిస్సిగ్గుగా అబద్ధాలు అచ్చేశాయని మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో దీనికి సంబంధించి విజువల్స్ ప్రదర్శించారు.
కేశవ్..రామానాయుడు సస్పెన్షన్
ఇదే సమయంలోకేశవ్ అలా వ్యాఖ్యానించి ఉంటే ఆయన పైన చర్యలు తీసుకోవాలని..లేకుంటే ఆ విధంగా వార్తను ప్రచురించిన మీడియా సంస్థపైన చర్య తీసుకోవాలని మంత్రులు డిమాండ్ చేసారు. కేశవ్ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం పైన ఉద్దేశ పూర్వకంగా... సభా గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించిన వారి పైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పీకర్ ను కోరింది .దీంతో, ఈ వ్యవహారాన్ని ప్రివిలేజ్ కమిటీకి ఇస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అదే సమయంలో ఈ విధమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలు కేశవ్..రామానాయుడను ఈ సమావేశాల వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం తీర్మానం ప్రతిపాదించింది. ఆమోదం లభించటంతో వారిద్దరినీ ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసారు. వీరికి మద్దతుగా నిలుస్తూ ఆందోళన కొనసాగిస్తున్న మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలను ఈ రోజు వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
కోటంరెడ్డి పై సస్పెన్షన్ వేటు
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఉదయం నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ బయట తన నిరసన వ్యక్తం చేసారు. సభలోనూ తన నియోజకవర్గ సమస్యల పైన చర్చించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసారు. దీని పైన మంత్రి అంబటి సమాధానం ఇచ్చారు. టీడీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని..వ్యక్తిగత అజెండాల సభలో ఉండవని స్పష్టం చేసారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తరువాత కోటంరెడ్డి స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేసారు. మంత్రి బుగ్గన వారించినా వినలేదు. దీంతో..కోటంరెడ్డిని ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ తీర్మానం చేయటంతో.. స్పీకర్ వెంటనే తన నిర్ణయం ప్రకటించారు. కోటంరెడ్డి పైన మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications