ఆ విషయంపై వైఎస్ జగన్ ఆందోళన- అమిత్ షా దృష్టికి
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండో రోజు- వామపక్ష ఉగ్రవాదంపై కేంద్ర హోం శాఖ నిర్వహించిన సదస్సుకు హాజరయ్యారు. రాత్రి ఆ శాఖ మంత్రి అమిత్ షానూ కలిశారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలుపై చర్చించారు. శనివారం నాటితో ఆయన పర్యటన ముగుస్తుంది. మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుంటారు వైఎస్ జగన్.
ఈ సందర్భంగా- ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. కృష్ణా జలాల అంశాన్ని తన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. కృష్ణా జలాల పంపకాల విషయంలో ఏపీ ప్రజల ఆందోళనలను పరిగణలోకి తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపేయాలని కోరారు.

అమిత్ షాతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్- ఆరు అంశాలను ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయడం, పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల, కృష్ణా జలాలపై ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం- ఇందులో కృష్ణా నదీ జలాల పంపకాల విషయంలో పరీవాహక రాష్ట్రాలయిన మహారాష్ట్ర, కర్ణాటకలను మినహాయించి ఏపీ, తెలంగాణలను మాత్రమే చేర్చడం వంటివి ఉన్నాయి.
ఏపీ, తెలంగాణకు మాత్రమే కొత్త ట్రిబ్యునల్ విధి విధానాలను పరిమితం చేయడం, మహారాష్ట్ర, కర్ణాటకలను పూర్తిగా మినహాయించాలని ఏకపక్షంగా సూచించడం అశాస్త్రీయమని జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ ఆస్తి అయిన నీటి వనరులను న్యాయంగా వినియోగించుకోవడానికి వ్యతిరేకమేనని స్పష్టం చేశారు.

గతంలో బచావత్ ట్రిబ్యునల్ గానీ, 1956 నాటి అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం కేటాయించిన నీటి వాటాలను మహారాష్ట్ర, కర్ణాటకలకు కొనసాగిస్తూ, ఏపీ, తెలంగాణలకు మాత్రమే గతంలో జరిగిన నీటి కేటాయింపులను పునఃసమీక్షించేలా కొత్తగా విధి విధానాలను ఖరారు చేయడం, వాటిని ఆమోదించడం పట్ల జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయడానికి పెండింగ్ నిధులను విడుదల చేయాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన చోటు చేసుకుని తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ- ఇంకా పునర్విభజన చట్టం పూర్తిస్థాయిలో అమలు కావట్లేదని, అందులో పొందుపరిచిన హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications