చంద్రబాబు అధికార దుర్వినియోగం?: టీడీపీ ఎంపీ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ల సదస్సా?
అమరావతి: విభజన తర్వాత ఏపీ ఆర్ధికంగా నష్టాల్లో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సదస్సు బుధవారం ఉదయం విజయవాడలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రెండేళ్ల పాలనపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. భవిష్యత్ ప్రణాళికలపై కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన నేపథ్యంలో ఈ రెండు సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పారు. 2022 నాటికి ఏపీ దేశంలో టాప్ 3లో, 2029 నాటికి టాప్ 1లో ఉండాలన్నారు.
రాష్ట్ర రెవెన్యూ 3.1 శాతం పెరిగిందన్నారు. రొటీన్ అజెండాతో కాకుండా వినూత్నంగా ఆలోచించాలన్నారు. విజన్ 2050ని టార్గెట్‌గా పెట్టుకున్నామని చెప్పారు. మూడు నెలలకోసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోటీతత్వం పెరగాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అద్భుతంగా పని చేశామన్నారు.
రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.1,07,532గా ఉందన్నారు. రూ.1,40,648తో విశాఖ ప్రథమ స్థానంలో, రూ.1,40,593తో కృష్ణా జిల్లా రెండోస్థానంలో, రూ.1,21,724తో పశ్చిమగోదావరి మూడోస్థానంలో ఉండగా... రూ.74,638తో శ్రీకాకుళం జిల్లా చివరిస్థానంలో ఉందన్నారు. అభివృద్ధిలో జిల్లాలు పోటీ పడాలన్నారు.

ప్రభుత్వ ఆలోచనలు, ఉద్దేశ్యాలు కింది వరకు వెళ్లాలన్నదే తన ఉద్దేశ్యమని చెప్పారు. దీనికోసం అధికారులు ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలతో పోటీపడి పనిచేయాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల 1.51శాతం భూగర్భ జలాలు పెరిగినట్లు వ్లెడించారు.
చంద్రబాబు అభివృద్ధికి సంబంధించిన పుస్తకాన్ని బుధవారం నాడు విడుదల చేశారు. అయితే కలెక్టర్ల సమావేశం పేరుతో టీడీపీ ప్రభుత్వం మరోసారి అధికార దుర్వినియోగానికి తెర లేపిందని విపక్షాలు మండిపడుతున్నాయి. రెండు రోజుల కలెక్టర్ల సదస్సుకు ప్రభుత్వం దాదాపు రూ. కోటి ఖర్చు చేస్తోందన్నారు.
స్టార్ హోటల్‌లో వసతి, విమాన ఛార్జీలు, భోజన వసతుల కోసం భారీగా నిధులు మంజూరు చేసింది. అంతేకాదు గతంలో జరిగిన కలెక్టర్ల సమావేశాన్ని నగరంలోని ఏ1 ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తే, ఈ ఏడాది మాత్రం నగరానికి దూరంగా ఉన్న ఓ టీడీపీ ఎంపీకి చెందిన ఫంక్షన్ హాల్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ప్రభుత్వ తీరుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications