నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం : పవన్ కళ్యాణ్
నేరస్థులకు కులాలు అంటగట్టడం సరికాదని.. నేరాలకు పాల్పడిన వారిని కులం పేరుతో సమర్థించడం సమాజానికి ప్రమాదకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తాను హోంమంత్రిని కాదని.. అది క్రిమినల్స్ అదృష్టం" అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కఠినంగా అమలు కావాల్సిన అవసరం ఉందని, చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. ఈ మేరకు కాకినాడలో నిర్వహించిన 'మన ఊరు.. మాట మంతి' కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతే కాకుండా నేరస్థులకు రాజకీయంగా అండగా నిలిచే నాయకులను ప్రజలు దూరం పెట్టాలని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే వ్యక్తులను ఎన్నుకోబోమని ప్రజలు గట్టిగా చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. నేరస్థులను ప్రోత్సహిస్తే మన భవిష్యత్తును మనమే మంటగలిపినట్టేనని వ్యాఖ్యానించారు. కొందరు నాయకులు తమకు అనుకూలమైన అంశాలపైనే స్పందిస్తారని, తాను మాత్రం ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంపై స్పందిస్తానని స్పష్టం చేశారు. నేరస్థులకు కులాలు, మతాలు, రాజకీయ రంగులు వేయకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడమే సమాజానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు.

సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు ధ్వంసం..
సుగాలి ప్రీతి హత్య కేసును గతంలో సీబీఐకి అప్పగించాలని తాను తీవ్రంగా ఆందోళన చేశానని పవన్ గుర్తుచేశారు. అయితే అప్పటి ప్రభుత్వం కేవలం తూతూమంత్రంగా సీబీఐకి లేఖ రాసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించగా, గత ప్రభుత్వ హయాంలోనే కీలక సాక్ష్యాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. నేరస్థులను వెనకేసుకొస్తే అది సమాజానికి మంచిది కాదని, క్రిమినల్ గ్యాంగులతో ప్రభుత్వాలు నడవవని స్పష్టం చేశారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తులు రాజ్యాంగబద్ధ పదవుల్లో కూర్చొని పాలించాలని ప్రయత్నిస్తే జీవితాంతం పోరాడతానని తేల్చి చెప్పారు.
డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ..
కొంతమంది నేర సంఘటనలను కూడా కుల కోణంలో చూస్తున్నారని పవన్ మండిపడ్డారు. "డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఘటనలో కులం కనిపించలేదు. కానీ ఒక రౌడీ ఎలిమెంట్ చనిపోతే వెంటనే కులం పేరుతో మాట్లాడటం ఎందుకు?" అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కుల రాజకీయాలు, నేర రాజకీయాలు కలిసి ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. "కులాల దరిద్రం వదిలితేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది" అని వ్యాఖ్యానించారు.
యువతే భవిష్యత్తును నిర్ణయించాలి..
'జెన్జీ.. జెన్జీ' అని చెప్పుకోవడం కంటే తమ భవిష్యత్తును యువతే నిర్మించుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. తాను మళ్లీ ఎన్నికల్లో గెలుస్తానో లేదో తెలియదని, కానీ ప్రజల కోసం పోరాటం మాత్రం కొనసాగిస్తానని చెప్పారు. విపక్షం మళ్లీ అధికారంలోకి వస్తుందేమోనని భయపడాల్సిన అవసరం లేదని, రౌడీయిజం, గూండాయిజానికి పాల్పడే వారిని కఠినంగా అణచివేస్తామని హెచ్చరించారు. ప్రజలను భయపెట్టి రాజకీయాలు చేసే రోజులు ముగిసిపోయాయని అన్నారు.
నేను Home minister కాదు అది నా పరిధిలోకి రాదు అది క్రిమినల్ తాలూకా అదృష్టం 🔥🔥 pic.twitter.com/jy175plODW
— Amalapuram PK FC™ (@amalapurampkfc) June 20, 2026












Click it and Unblock the Notifications