ఏపీ ఉద్యోగుల సహాయ నిరాకరణ ప్రారంభం-పెన్ డౌన్, యాప్ డౌన్ తో-ఎల్లుండి సమ్మె సన్నాహాలు
ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ పోరు తీవ్రమవుతోంది. పీఆర్సీ జీవోలను విడుదల చేయడంపై ఉద్యోగులు పోరు మొదలుపెట్టిన నేపథ్యంలో బలవంతంగా జీతాల్ని ఉద్యోగుల ఖాతాల్లో వేయడం చర్చనీయాంశమైంది. దీనికి నిరసనగా నిన్న ఛలో విజయవాడను విజయవంతంగా ముగించిన ఉద్యోగసంఘాలు.. తదుపరి కార్యాచరణపై దృష్టిసారించాయి.
ఏపీలో పీఆర్సీ విషయంలో ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆరోపిస్తున్న ఉద్యోగులు ఇవాళ్టి నుంచి సర్కార్ కు సహాయ నిరాకరణ ప్రారంభించాయి. ఇందులో భాగంగా పెన్ డౌన్, యాప్ డౌన్ లను మొదలుపెట్టారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి క్షేత్రస్దాయి వరకూ ఈ కార్యక్రమం కొనసాగబోతోంది. ఎల్లుండి సమ్మెకు సన్నాహకంగా దీన్ని మొదలుపెట్టారు. ఉదయం నుంచే ఉద్యోగులు విధులకు హాజరైనప్పటికీ విధుల్లో నిమగ్నం కాలేదు. ఎలాంటి ఫైల్స్ ను ముట్టుకోకుండా ప్రభుత్వానికి తమ నిరసన తెలుపుతున్నారు.

అమరావతి ప్రాంతంలో సచివాలయంతో పాటు వివిధ విభాగాధిపతుల కార్యాలయాలకు కూడా రేపటి నుంచి రెండు రోజులు సెలవులు కావడంతో ఇవాళ నుంచే సహాయ నిరాకరణ ప్రారంభించారు. మిగతా చోట్ల రేపటి నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభఁ కానున్నాయి. అమరావతిలోని సచివాలయంలో ఉద్యోగులు ఉదయం కార్యాలయాలకు వచ్చినప్పటికీ పని చేయకుండా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. విధులకు దూరంగా ఉండిపోయారు. దీంతో ఎక్కడి ఫైళ్లు అక్కడే ఉండిపోయాయి. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని ఉపసంహరించుకునే వరకూ తమ పోరు కొనసాగుతుందని ఉద్యోగులు చెప్తున్నారు.
Recommended Video
మరోవైపు ప్రభుత్వం పీఆర్సీ సాధన సమితి నేతల్ని ఇవాళ సచివాలయంలో చర్చలకు ఆహ్వానించింది. దీంతో స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుని దీనికి హాజరయ్యే అంశంపై నేతలు జరుపుతున్నారు. ప్రభుత్వం భిన్న వాదనల నేపథ్యంలో పీఆర్సీపై చర్చలకు వెళ్లాలా వద్దా అన్న దానిపై ఉద్యోగ నేతలు నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే ఎల్లుండి నుంచి సమ్మె సన్నాహాలపైనా నేతలు చర్చిస్తున్నారు.












Click it and Unblock the Notifications