ఫ్రాన్స్ లో ఏపీ మంత్రి పెట్టుబడుల వేట-రోడ్ షో..!
ఏపీలో కూటమి సర్కార్ ప్రస్తుతం రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం దేశ విదేశాల్లో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఏకంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలికారు. ముఖ్యంగా విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో జరిగే సీఐఐ సదస్సుకు రావాలని కోరారు.
సుదీర్ఘ తీర ప్రాంతం, నాణ్యమైన విద్యుత్, రోడ్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, బిజినెస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూల ప్రదేశమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే సీఐఐ అంతర్జాతీయ సమ్మిట్ కు ఫ్రాన్స్ దేశ పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు. మంత్రి గొట్టిపాటి నేతృత్వంలోని అధికారుల బృందం ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఇవాళ పారిస్ లో రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను పవర్ పాయింట్ ప్రజెంటనేషన్ ద్వారా పెట్టుబడిదారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండే వివిధ ప్రభుత్వ పాలసీలతో పాటు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను పెట్టుబడిదారులు అంది పుచ్చుకోవాలని మంత్రి కోరారు. పెట్టుబడి ప్రోత్సహకాలు, రోడ్డు కనెక్టివిటీతో పాటు అందుబాటులో ఉన్న వివిధ రకాల సదుపాయాలను ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలకు వివరించారు.
చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలను ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలకు మంత్రి గొట్టిపాటి, ఆయన బృందం వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిష్టాత్మంగా నిర్మాణం జరుగుతున్న రాజధాని అమరావతి నగర నిర్మాణ విశేషాలను ఈ సందర్భంగా వారికి వివరించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఆస్తిగా పేర్కొన్న మంత్రి గొట్టిపాటి., రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఫ్రాన్స్ పెట్టుబడిదారులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అదే విధంగా ఫ్రాన్స్ లో ప్రముఖ పునరుత్పాదక విద్యుత్ సంస్థ అయిన ఈడీఎఫ్ సంస్థ ప్రతినిధులతోనూ మంత్రి గొట్టిపాటి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఉన్నపెట్టుబడి అవకాశాలను వారికి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలను ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications