ఈ వ్యాపారం మాకొద్దు - పట్టు వీడని లిక్కర్ వ్యాపారులు, ఇక నెక్స్ట్..!!
ఏపీలో ఎక్సైజ్ అధికారుల ప్రయత్నాలు ఫలించటం లేదు. కొత్త బార్ పాలసీకి వ్యాపారుల నుంచి స్పందన లేకపోవటం సమస్యగా మారుతోంది. గత నెలలోనే బార్ల కోసం టెండర్లు దాఖలు చేయగా సగం బార్లకే దరఖాస్తులు వచ్చాయి. దీంతో, మిగిలిన సగం బార్లకు తిరిగి నోటిఫికేషన్ ఇచ్చారు. అయినా, పరిస్థితిలో మార్పు రాలేదు. ఎక్సైజ్ అధికారులు ప్రయత్నాలకు ఫలితం లేకపోవటం తో మరోసారి టెండర్ల గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో బార్ పాలసీకి స్పందన లేకపోవటం ఎక్సైజ్ అధికారులకు సమస్యగా మారుతోంది. రాష్ట్రం లోని 428 బార్లకు రీనోటిఫికేషన్ జారీచేయగా పది రోజుల సమయంలో 11 బార్లకే నాలుగు చొప్పున దరఖాస్తులు అందాయి. ఇంకా 417 బార్లకు దరఖాస్తులు రావాల్సి ఉంది. షెడ్యూలు ప్రకారం ఆదివారంతో దరఖాస్తుల గడువు ముగుస్తోంది. సోమవారం లాటరీ నిర్వహించి లైసెన్సీలను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఇంకా 97 శాతం బార్లకు దరఖాస్తులు రాకపోవడంతో ఈ నెల 17 వరకు గడువు పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతలో మొత్తం 840 బార్లకు నోటిఫికేషన్ ఇవ్వగా రెండుసార్లు గడువు పొడిగించిన తర్వాత 412 బార్లకు దరఖాస్తులు వచ్చాయి.

దీంతో, మిగిలిన 428 బార్లకు ఈ నెల 3న రెండో విడత నోటిఫికేషన్ జారీ చేశారు. దరఖాస్తుల సమర్పణకు గతంలో ఇచ్చిన దానికంటే రెట్టింపు సమయం ఇచ్చారు. అయినా పది రోజుల్లో కేవలం 11 బార్లకే దరఖాస్తులు అందాయు. దీంతో, వచ్చిన దరఖాస్తులకు 18న లాటరీ నిర్వహణ కు అధికారులు నిర్ణయించారు. వరుసగా బ్యాంకులకు సెలవులు, వర్షాల కారణంగా ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మిగిలిన నాలుగు రోజుల సమయంలో దరఖాస్తులు ఏ స్థాయిలో వస్తాయనేది కీలకంగా మారుతోంది. తాజాగా ఎక్సైజ్ డైరెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఇప్పుడు బార్లకు టెండర్ల వ్యవహారం పైన ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. ఈ సారి పొడిగించిన తేదీకి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోతే.. ఎక్సైజ్ శాఖ వద్ద ఉన్న ప్రత్యామ్నాయ మార్గం ఏంటనేది కీలకంగా మారుతోంది. 17వ తేదీ వరకు వచ్చే దరఖాస్తుల ఆధారంగా ఎక్సైజ్ శాఖ తదుపరి నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications