ఏపీలో చికెన్, ఎగ్ మేళాలు..! ఫ్రీ అంటే ఎగబడుతున్న జనం..!
ఏపీలో కోళ్లకు బర్డ్ ప్లూ సోకుతుందన్న వార్తలతో జనం కొంతకాలంగా చికెన్ తినడమే మానేశారు. అంతే కాదు గుడ్ల వాడకం కూడా తగ్గించేశారు. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ అల్లాడుతోంది. దీని మీద ఆధారపడిన వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రంగంలోకి దిగింది. పశుసంవర్ధకశాఖ అధికారులు పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. తిరిగి చికెన్ అమ్మకాలను గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా రాష్ట్రంలో వరుసగా చికెన్, ఎగ్ మేళాలు నిర్వహిస్తున్నారు. తాజాగా గుంటూరులో నిర్వహించిన ఫ్రీ చికెన్, ఎగ్ మేళాకు వచ్చిన స్పందన చూసి ప్రభుత్వమే ఆశ్చర్యపోయింది. ఇన్నాళ్లు బర్డ్ ఫ్లూ వచ్చిందంటూ చికెన్, గుడ్లు తినడమే మానేసిన వాళ్లంతా ఫ్రీ అనగానే ఇంత బారీ స్ధాయిలో తరలివచ్చి తినేయడం పరిశ్రమ వర్గాల్ని సైతం సంతోషంలో ముంచెత్తింది. దీని స్ఫూర్తితో తాజాగా ఏలూరులోనూ చికెన్, ఎగ్ మేళా నిర్వహించారు. రేపు అనకాపల్లిలోనూ మరో మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

గుంటూరులో నిర్వహించిన ఫ్రీ చికెన్, ఎగ్ మేళాకు వచ్చిన స్పందన నేపథ్యంలో ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మేళాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో మేళా నిర్వహిస్తామని పశుసంవర్ధకశాఖ అధికారులు, పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు తెలిపారు. ఇది కూడా విజయవంతం అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమలోనూ మరిన్ని మేళాలు నిర్వహించనున్నారు. అయితే గతంతో పోలిస్తే ఈ మేళాల తర్వాత బర్డ్ ఫ్లూ భయాలు అయితే తగ్గుతున్నాయని అమ్మకాలు చెప్తున్నాయి. ఎలాగో వేసవికాలం వచ్చేస్తే బర్డ్ ఫ్లూ భయాలు పూర్తిగా తొలగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications