రెండు రోజుల్లో వారందరికీ అకౌంట్లలో డబ్బులు వేస్తాం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుభవార్త వినిపించారు. ఇటీవల బుడమేరు పొంగడంతో విజయవాడ నగరం సగం మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎంతోమంది ఇళ్లల్లోకి వరద చేరడంతో వస్తువులన్నీ దెబ్బతిని పూర్తిగా నష్టపోయారు. అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని రైతుల పంటలు దెబ్బతిన్నాయి. వీరందరికీ ఇప్పటివరకు నష్టపరిహారం కింద డబ్బులను వారి వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. అయితే మరికొందరికి ఇంకా డబ్బులు రావాల్సి ఉందని, వారికి అందలేదంటూ ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నారు.
సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని సీఎం ఆదేశం
దీనిపై స్పందించిన చంద్రబాబు వరద బాధితుల బ్యాంకు ఖాతాలకు సంబంధినంచిన సాంకేతిక సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల వివరాలను సచివాలయాల్లో ప్రదర్శించాలని, దీనివల్ల ఒక అవగాహన వస్తుందన్నారు. ఇప్పటివరకు దాదాపు నాలుగున్నర లక్షలమంది బ్యాంకు ఖాతాల్లో రూ.602 కోట్లు జమ చేశారు. కొత్తగా మరో మూడువేల దరఖాస్తులు రావడంతో వీటిని పరిశీలించి 1646 మందికి అర్హత ఉన్నట్లు తేల్చారు. వీరిలో 850 మందికి వారి వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. మిగిలినవారికి డబ్బులు పడలేదు. మొదటి విడతలో పరిహారం పొందిన దరఖాస్తుదారుల వివరాలను వెబ్ సైట్ లో ఉంచాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.

85 శాతం పూర్తయిన బీమా ప్రక్రియ
బీమా కంపెనీలతో మాట్లాడుతున్నామని, ఇప్పటికే 85 శాతం బీమా ప్రక్రియ పూర్తయిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. తాను ఇప్పటికీ వరద బాధితుల నష్టపరిహారం విషయానికి సంబంధించి సమీక్షలు జరుపుతున్నానని, వరదల్లో ఇల్లు నీటమునిగితే రూ.25వేలు, విభిన్న దుకాణాలవారికి రూ.25వేలు, మొదటి అంతస్తులోకి వరద చేరినవారికి రూ.10వేల చొప్పున అందజేశామన్నారు. తోపుడు బండ్లమీద వ్యాపారం చేసేవారు అవి దెబ్బతింటే కొత్తవి కొనుగోలు చేసేందుకు రూ.20వేలు, ఆటోలు నీటమునిగి మరమ్మతులకు గురైతే రూ.10వేల చొప్పున అందజేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications