'అన్నదాత సుఖీభవ' వారికే - అర్హతలు, ముహూర్తం ప్రకటన..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం వెల్లడించింది. తాజాగా ఏపీ బడ్జెట్ లో రైతుల కోసం హామీ ఇచ్చిన విధంగా అన్నదాత సుఖీభవ పథకం కోసం నిధులు కేటాయించారు. ఈ పథకం అమలు విషయంలో ఉన్న సందేహాలకు సమాధానంగా ప్రభుత్వం శాసన మండలి వేదికగా కీలక ప్రకటన చేసింది. అర్హులైన ప్రతీ రైతుకు ఈ పథకం కింద నిధులు జమ అవుతాయని మంత్రి అచ్చెన్నా యుడు ప్రకటించారు. ఈ పథకం అమలు ముహూర్తంతో పాటుగా విధి విధానాల పైనా మంత్రి స్పష్టత ఇచ్చారు.
ప్రభుత్వం క్లారిటీ
వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు అన్నదాత సుఖీభవ పథకం అమలు పైన క్లారిటీ ఇచ్చారు. కూటమి నేతలు ఎన్నికల సమయంలో ప్రతీ రైతుకు రూ 20 వేలు చొప్పున ఆర్దిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత తాజాగా ప్రవేశ పెట్టిన 20 25-26 వార్షిక బడ్జెట్ లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. గతంలో వైసీపీ హయాంలో రైతు భరోసాగా అమలు చేసిన పథకానికి అన్నదాత సుఖీభవగా పేరు మార్పు చేసిన కూటమి ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్ లో ఇందు కోసం రూ 9,400 కోట్లు ప్రతిపాదించింది. కావాల్సిన మొత్తం కంటే తక్కువగా నిధులు కేటాయించారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు ఈ పథకం అమలు గురించి వివరించారు.

పీఎం కిసాన్ తో కలిపి
అన్నదాత సుఖీభవ పథకం కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ తో కలిపి అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, పీఎం కిసాన్ కింద అందించే రూ 6 వేలు మినహాయించి రూ 14 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు నిర్ణయించింది. మూడు విడతల్లో ఈ నిధులు జమ చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు ఈ పథకం రానున్న మే నెలలో ప్రారంభిస్తామని ప్రకటించారు. అర్హత కలిగిన రైతులందరికి రూ. 20 వేల నగదు అందజేస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలుపై విధి విదానాలు ఖరారు చేస్తున్నట్లు వెల్లడించారు.
మే నెలలో అమలు
ప్రభుత్వం ఇచ్చే నగదు రైతులకు సాయం మాత్రమేనని అచ్చెన్న స్పష్టం చేసారు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాం లో ఓసీ కౌలు రైతులకు రైతు భరోసా నిధులు అందలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు ఇస్తామని చెబుతోంది. అయితే, ఈ పథకం దాదాపు 55 లక్షల మంది రైతులకు అమలు చేయాల్సి ఉంది. దీంతో.. ఇప్పుడు కౌలు రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రకటించే మార్గదర్శకాల కోసం రైతులు వేచి చూస్తున్నారు. మే నెలలో తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications