అప్పుల్లో జగన్ ను మరిపిస్తున్న కూటమి ప్రభుత్వం..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పుల పైన చర్చ మొదలైంది. జూన్ 12న కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువు తీరింది. ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ప్రధానంగా కూటమి నేతలు ప్రచారం చేసారు. ఆ తరువాత రాష్ట్ర ఆర్దిక పరిస్థితి పైన శ్వేత పత్రాలు విడుదల చేసారు. అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ హామీ మాత్రం అమలు చేస్తున్నారు. ఈ సమయంలోనే కూటమి ప్రభుత్వం చేసిన అప్పుల లెక్కల పైన అధికార యంత్రాంగంలో.. రాజకీయంగా చర్చ మొదలైంది.
7 వేల కోట్లకు కేంద్రం అనుమతి
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం తాజాగా రూ 7 వేల కోట్ల అప్పు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో వినియోగించుకునేందుకు రూ. 47,000 కోట్లకు కేంద్రం అనుమతి ఇవ్వగా.. సెప్టెంబరు ఆఖరుకి ఈ పరిమితి ముగిసిపోయింది. ఇప్పుడు కొత్తగా అక్టోబరు-డిసెంబరు మధ్య వాడుకునేందుకు రూ.7,000 కోట్లకు అనుమతి తెలిపింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు వచ్చిన అప్పుల అనుమతి రూ.54,000 కోట్లకు చేరింది. రిజర్వ్ బ్యాంక్ నుంచి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 3,000 కోట్ల అప్పు తెచ్చింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో సెక్యూరిటీల వేలం ద్వారా తెచ్చిన అప్పు రూ. 50,000 కోట్లకు చేరింది.

59 వేల కోట్ల అప్పులు
జూన్ 12న అధికార పగ్గాలు చేపట్టిన కూటమి నేతలు.. ఎన్నికల హామీల్లో భాగంగా పెన్షన్ రూ 3 వేల నుంచి రూ 4 వేలకు పెంచి అమలు చేస్తోంది. ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. గ్యాస్ సిలిండర్ల పథకం దీపావళి నుంచి అమలు చేయనుంది. ఇదే సమయంలో ఇప్పటి వరకు నాలుగు నెలల ఇరవై రోజుల కాలంలో కూటమి ప్రభుత్వం మొత్తంగా రూ 59 వేల కోట్ల అప్పు చేసింది. తాజాగా ఆర్బీఐ లో సెక్యూరిటీల వేలం ద్వారా మరో రూ 3 వేల కోట్ల రుణ సేకరణకు నిర్ణయించింది. ఈ తరహా అప్పుల ద్వారా రూ 51 వేల కోట్లు సేకరించిన కూటమి ప్రభుత్వం కార్పోరేషన్ల రుణాల ద్వారా మరో రూ 8 వేల కోట్లు సమీకరించినట్లు లెక్కలు చెబుతున్నాయి.
మరో 8 వేల కోట్లు
చంద్రబాబు ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా రూ 5 వేల కోట్లు, పౌర సరఫరాల ద్వారా రూ 2,000
కోట్లు, ఏపీఐఐసీ ద్వారా రూ వెయ్యి కోట్ల మేర రుణం తీసుకుంది. కాగా, అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టని ప్రభుత్వం నవంబర్ 11న అసెంబ్లీలో ప్రతిపాదించేందుకు నిర్ణయించింది. అయితే, ప్రభుత్వం నాలుగున్నార నెలల కాలంలో చేసిన అప్పులు.. ఖర్చుల పైన అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక.. వచ్చే జనవరి, కొత్త ఆర్దిక సంవత్సరం ప్రారంభమైన సంక్షేమ పథకాల అమలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీంతో, రాష్ట్ర ఆర్దిక నిర్వహణ పైన అధికార యంత్రాంగంతో పాటుగా రాజకీయంగానూ ఆసక్తి కర చర్చ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications