సీఎం జగన్ ఓట్ బ్యాంక్ పెరిగిందా - తాజా లెక్కలు ఏం చెబుతున్నాయి..!!
సీఎం జగన్ ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. అభ్యర్ధుల ఎంపిక నుంచి ప్రతీ వర్గాన్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్దిదారులే వైసీపీకి బలమైన ఓట్ బ్యాంక్ గా మారుతోంది. దీంతో జగన్ సంక్షేమ మార్గంలోనే ప్రతిపక్షాలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పుడు తన ఓట్ బ్యాంక్ పెంచుకొనేందుకు జగన్ వ్యూహాత్మకంగా అర్హత ఉన్న లబ్దిదారులకు పథకాలు ఇవ్వాలని నిర్ణయించారు. వీరి సంఖ్య పెరిగినట్లు ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
పెరిగిన లబ్దిదారుల సంఖ్య: జగన్ తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను ఎన్నికల మేనిఫెస్టోగా మార్చారు. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి అమలుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు రూ 2.25 లక్షల కోట్ల మేర దాదాపు రెండు కోట్లకు పైగా ఉన్న లబ్ది దారులకు మంచి చేసినట్లు ప్రభుత్వ వర్గాలు లెక్కలు చెబుతున్నాయి.

సీఎం జగన్ సైతం ప్రతీ సభలో తన పాలనలో ప్రతీ ఇంటికి పార్టీలకు అతీతంగా అవినీతికి ఆస్కారం లేకుండా మంచి చేసామని చెబుతూ వచ్చారు. మంచి జరిగిందని నమ్మితేనే తనకు అండగా నిలవాలని కోరుతున్నారు. అందులో భాగంగా సంక్షేమ ఓట్ బ్యాంకు ను సుస్థిరం చేసుకోవటంతో పాటుగా ప్రతీ ఇంటికి యంత్రాగాన్ని దగ్గర చేసేందుకు జగనన్న సురక్ష నిర్వహించారు.
1.38 కోట్ల కుటుంబాలను కలిసి: ఈ కార్యక్రమం ద్వారా నెల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.38 కోట్ల కుటుంబాలను ఇంటివద్ద కలుసుకోవడం ద్వారా పెండింగ్ సమస్యలు లేకుండా అధికార యంత్రాంగం ప్రతి ఇంటినీ జల్లెడ పట్టింది. జూన్ 23వ తేదీన సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం నేటితో (జూలై 31వ తేదీ) ముగియనుంది.

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోరాదనే లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. వారికి అర్హత సాధించేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అందించింది. అర్హత సాధించిన వారికి త్వరలోనే పథకాల లబ్ది దారులుగా గుర్తింపు దక్కనుంది. దీంతో వైసీపీ ఓట్ బ్యాంక్ మరంతగా పెరగనుంది.
ఓట్ బ్యాంక్ పెంచుకొనేలా
ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు మొత్తం 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఈ క్యాంపుల ద్వారా ఎలాంటి సర్విసు చార్జీలు లేకుండా ఉచితంగా అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 59 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు కోటి మందికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రయోజనం చేకూర్చారు. 99.80 లక్షల టోకెన్లు జారీ కాగా క్యాంపులు జరిగిన రోజు అధికారుల వద్దకు 95.96 లక్షల వినతులు ప్రస్తావనకు వచ్చాయి.
ఇందులో 92.97 లక్షల వినతులను అధికారులు అక్కడికక్కడే పరిష్కరించారు. అత్యధికంగా 40.52 లక్షల మంది కుల ధ్రువీకరణ పత్రాలను పొందగా 38.52 లక్షల మందికి ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. దీంతో, ఎన్నికల వేళ వైసీపీకి అనుకూల వాతావరణం ఏర్పడేలా మరిన్ని నిర్ణయాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications