పెన్షన్ లబ్దిదారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ - తాజా నిర్ణయంతో..!!
ఏపీలో ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంక్షేమమే తిరిగి తనకు అధికారం అందిస్తుందని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. అదే సమయంలో పాలనా..పార్టీ పరంగానూ వరుస నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. రాజకీయంగా ప్రతిపక్షాలపై పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తూనే..సంక్షేమ ఓట్ బ్యాంక్ ను మరింత పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా పెన్షన్ల లబ్దిదారుల కు సంబంధించి ముఖ్య నిర్ణయం తీసుకున్నారు.
65.98 లక్షలకు చేరిన లబ్దిదారులు:ఏపీలో సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏడాదికి రూ 2,250 చొప్పన పెంచుతూ వచ్చే ఏడాదికి పెన్షన్ ను రూ. 3,000కి పెంచనున్నారు. ఇదే సమయంలో అర్హత ఉండీ పెన్షన్ అందని వారిని గుర్తించేందుకు గత రెండు నెలల కాలంలో జగనన్న సురక్ష ద్వారా ఇంటింట లబ్దిదారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించారు. అందులో అర్హత ఉన్నట్లుగా గుర్తించిన వారికి పెన్షన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు, ఈ క్రమంలో ఇప్పటికే కొత్తగా 1.48 లక్షల మందికి పెన్షన్ అందిస్తుండగా..

ఈ రోజు నుంచి కొత్తగా మరో 1.93 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలో ప్రతి నెలా అందజేసే పింఛన్ల సంఖ్య రికార్డు స్థాయిలో 65,98,138కి చేరింది. కొత్తగా మంజూరైన వారికి ఈ నెల నుంచే ఫింఛన్ డబ్బులు పంపిణీ చేసేందుకు వీలుగా ఈ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని 14వతేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నెలలోనే 3.42 లక్షల మందికి:ఈ నెలలో కొత్తగా పింఛన్ మంజూరైన 1,93,680 మంది లబ్ధిదారులలో 95,653 మంది వృద్ధాప్య పింఛన్లున్నాయి. 40,058 మంది వితంతువులు, 29,858 మంది దివ్యాంగులు, 6,861 మంది డప్పు కళాకారులు, 4,763 మంది మత్య్సకారులు, 2,844 మంది కల్లుగీత కార్మికులు, 4 వేల మంది హెచ్‌ఐవీ బాధితులు కాగా మిగిలినవి ఇతర పింఛన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎప్పటిమాదిరిగానే ఈ నెల ఒకటో తేదీనే ప్రభుత్వం పింఛన్ల పంపిణీ ప్రారంభించే సమయంలో 1,48,772 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది.
అప్పటికే పింఛన్ల పొందుతున్న వారితో కలిపి సెప్టెంబరు ఒకటో తేదీన ప్రభుత్వం మొత్తం 64,04,458 మంది లబ్ధిదారులకు పింఛన్ల మొత్తాన్ని విడుదల చేసింది. తాజాగా రెండో విడతగా మంగళవారం మంజూరు చేసిన 1,93,680 మంది కొత్త లబ్ధిదారులతో కలిపి ఈ నెలలో రెండు విడతల్లో మొత్తం 3,42,452 మందికి ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేసింది.

పెన్షన్ల కోసం ప్రతీ నెలా రూ 1,819 కోట్లు:సెప్టెంబరు ఒకటో తేదీన మొత్తం 64,04,458 మందికి పింఛను డబ్బుల పంపిణీకి రూ.1,764.83 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా కొత్తగా మంజూరు చేసిన వారితో కలిపి ఈ నెలలో మొత్తం 65,98,138 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం మొత్తం రూ.1,819.02 కోట్లను సెప్టెంబర్‌లో విడుదల చేసింది.
ఈ నెలలో రెండు విడతలతో పాటు కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన 3,42,452 మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.96.12 కోట్ల చొప్పున అదనంగా ఖర్చు చేయనుంది. జగన్ సీఎం అయ్యాక 28,26,884 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసారు. గత ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ల కోసం సరాసరిన రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.1,819 కోట్లు ఖర్చు చేస్తోంది.












Click it and Unblock the Notifications