ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు, చంద్రబాబు ఎంపిక వెనుక- చివరి నిమిషంలో..!!
శాసన మండలిలో కూటమి సంఖ్యా బలం మరింత పెరగనుంది. మరో ఇద్దరు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు కానున్నారు. టీడీపీ నుంచి ఈ ఇద్దరి పేర్లు ఎంపిక చేసారు. వైసీపీకి చెందిన ఇద్దరు సభ్యుల పదవీ విరమణతో టీడీపీకి అవకాశం దక్కింది. సామాజిక- ప్రాంతీయ సమీకరణాలతో ఈ ఇద్దరి పేర్లను ఖరారు చేసారు. గవర్నర్ కు సిఫారసు.. ఆమోదం తరువాత అధికారికంగా ఈ ఇద్దరి నియామకం పైన నోటిఫికేషన్ జారీ కానుంది.
కూటమి ఖాతాలో మరో ఇద్దరు ఎమ్మెల్సీలు చేరారు. ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. వైసీపీ నుంచి పండుల రవీంద్ర బాబు, జకియా ఖానం గత నెల పదవీ విరమణ చేసారు. దీంతో.. కూటమి నుంచి ఈ రెండు స్థానాలు ఎవరికి ఇస్తారనే చర్చ జరిగింది. పలువురు పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. 2024 ఎన్నికల సమయంలో కూటమిలో సీట్ల సర్దుబాటు సమయంలో పలువురు సీనియర్లకు టికెట్లు దక్క లేదు. ఆ సమయంలో వారికి ఎమ్మెల్సీ పదవుల పైన హామీ ఇచ్చారు. దీంతో.. గవర్నర్ కోటా లో పార్టీ సీనియర్లకు అవకాశం వస్తుందని భావించారు. అయితే.. ఈ రెండు స్థానాలకు అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నారు. పలు మార్లు రాజ్యసభకు చివరి వరకు రేసులో నిలిచినా.. చివరకు స్థానం దక్కని పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యను ఎమ్మెల్సీ చేయాలని నిర్ణయించారు. భవిష్యత్ లో ఆయనకు శాసనమండలి ఛైర్మన్ పదవి దక్కటం ఖాయమని చెబుతున్నారు.

గవర్నర్ కు సిఫారసు
అదే విధంగా మరో సీటు కోసం రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ మహిళను ఎంపిక చేసారు. సామాన్య మహిళకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వటం ద్వారా పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు ఇచ్చిన ట్లు అవుతుందని భావిస్తున్నారు. అందులో భాగంగా అనంతపురం అంగన్ వాడీ సంఘం అధ్యక్షు రాలిగా పని చేసిన దళవాయి రమాదేవి పేరు ఖరారు చేసారు. గతంలో రమాదేవి టీడీపీ నుంచి అనంతపురంలో 47వ డివిజన్ కార్పోరేటర్ గా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ ప్రభుత్వ హయాం లో వరుస కేసులు ఎదుర్కొంది. దీంతో.. ఎస్సీ వర్గం నుంచి వర్ల రామయ్య... బీసీ వర్గం నుంచి రమాదేవి పేర్లు ఖరారు చేసారు. వర్ల రామయ్య టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, గతంలో ఆర్టీసీ ఛైర్మన్‌గా పనిచేశారు. వర్ల రామయ్యతో పాటుగా సాధారణ మహిళకు ఈ సారి అవకాశం దక్కింది. ఈ రెండు పేర్లను ప్రభుత్వం అధికారికంగా గవర్నర్ కు సిఫారసు చేయనుంది.













Click it and Unblock the Notifications