వారి ఖాతాల్లో నిధులు జమ చేసిన ఏపీ ప్రభుత్వం..!!
విజయవాడ వరద బాధితులకు పరిహారం విడుదల చేసింది. బుడమేరు ముంపుతో విజయవాడ లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించేందుకు ప్యాకేజీ ప్రకటించింది. నిధులు విడుదల చేసింది. కొద్ది రోజులుగా పరిహారం అందని వారు ఆందోళన చేస్తున్నారు. దీంతో, పరిహారం అందని వారిని గుర్తించి వారికి ఈ రోజు వారి ఖాతాల్లో పరిహార సొమ్ము జమ చేసింది.
నిధులు జమ
విజయవాడ వరద బాధితుల్లో పరిహారం అందని వారికి ప్రభుత్వం నేడు నిధులు జమ చేసింది. మరో 1501 మందికి రూ.2.5 కోట్ల పరిహారం విడుదలైంది. 1501 మంది బాధితులకు వారి అకౌంట్లకు ఈరోజు నగదును సర్కార్ బదిలీ చేసింది. ఇందులో బ్యాంక్ అకౌంట్ ఇనాక్టివ్‌గా ఉన్న కారణంతో 143 మందికి లబ్ధిదారుల అకౌంట్లలో పరిహారం జమ అవ్వలేదని అధికారులు గుర్తించారు. వీరికి సంబంధించి మరోసారి బ్యాంకు వివరాలు తీసుకుని పరిహారం అందించాలని నిర్ణయించారు. బ్యాంకు ఖాతాలు లేవని గుర్తించిన 256 మంది వివరాలను సచివాలయాలు, ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా ప్రభుత్వం వెల్లడించనున్నారు.

ప్రభుత్వ పరిహారం
బ్యాంక్ అకౌంట్ వివరాలు అందించి ఈ 256 మంది తమకు వచ్చే పరిహారం పొందవచ్చని అధికారులు తెలిపారు. వరద ఉధృతితో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. వారికి వరద సహాయాన్ని సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్‌లో విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు వరద సహాయాన్ని వారి ఖాతాల్లో వేశారు. ఇళ్లు, దుకాణాలు, తోపుడు బళ్లు, వ్యాపారాలు, చిన్న తరహ పరిశ్రమలు, వాహానాలు, పంటలు, పశువులకు ఆర్థిక సాయం అందించింది. వరదలు వచ్చిన 15 రోజుల్లోనే బాధితులకు వారి ఖాతాల్లో ప్రభుత్వం వరద సహాయాన్ని జమ చేసింది.

ఖాతాలకు బదిలీ
పరిహారంగా మొత్తం రూ.618 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. విడతల వారీగా ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాల్లో డబ్బును జమచేస్తోంది. ముందుగా రూ.602 కోట్లను జమ చేసిన సర్కార్.. ఆ తరువాత రూ.9 కోట్లు.. ఆపై రూ. 16 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో జమచేసింది. మొత్తం 4,19,528 మందికి ప్రభుత్వం పరిహారం అందజేసింది. అలాగే తాజాగా 2954 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1646 మందిని అర్హులుగా గుర్తించారు. వారిలో ప్రస్తుతం 1501 మంది బాధితులకు రూ.2.5 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం అందజేసింది. ఇంకా అందాల్సిన వారికి మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో పరిహారం అందేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications