చంద్రబాబు బెయిల్ పై హైకోర్టు నుంచి కీలక అప్డేట్..!!
తెలుగుదేశం అదినేత చంద్రబాబు బెయిల్ పైన హైకోర్టులో వాదనలు ముగిసాయి. రేపు న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. మధ్యంతర బెయిల్ కోసం చేసిన పిటీషన్ పైన తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. చంద్రబాబు ఆరోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకోవాని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును బెయిల్ ఇవ్వాలని అభ్యర్ధించారు. దీని పైన సుదీర్ఘ వాదనలు జరిగాయి. హెల్త్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. దీంతో, రేపు (మంగళవారం) చంద్రబాబు బెయిల్ పైన కోర్టు తీర్పు ఇవ్వనుంది.
హైకోర్టులో విచారణ : చంద్రబాబు పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్ల పై వాదనలు జరిగాయి. చంద్రబాబు ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయవాది లూధ్రా కోర్టును కోరారు. చంద్రబాబు 50 రోజులుగా జైలులో రిమాండ్ లో ఉన్న అంశాన్ని న్యాయవాదులు వివరించారు. అనారోగ్య సమస్యలతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

చంద్రబాబుకు గతంలో ఒక కంటికి ఆపరేషన్ జరిగిందని..రెండో కంటికి ఆపరేషన్ అవసరమని వైద్యులు చెప్పిన అంశాన్ని కోర్టుకు నివేదించారు. హైకోర్టుకు దసరా సెలవులకు ముందు పదే పదే బెయిల్ పిటిషన్లపై వాయిదాలు పడ్డాయి. తర్వాత విచారణ వాయిదా వేశారు. వెకేషన్ బెంచ్ లో విచారణ జరిగినా న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ చెప్పటంతో కేసు వాయిదా పడింది.
బెయిల్ ఇవ్వాలని వినతి : ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం విచారణకు రాగా చంద్రబాబుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కోర్టు ముందు ఉంచాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయడంతో న్యాయమూర్తుల రోస్టర్ మారుస్తూ చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకున్నారు.
గతంలో క్వాష్ పిటిషన్లను జస్టిస్ శ్రీనివాసరెడ్డి, బెయిల్ పిటిషన్లను సురేష్ రెడ్డి విచారించేవారు. ఇప్పుడు రోస్టర్ మారడంతో క్వాష్ పిటిషన్లు, బెయిల్ పిటిషన్లు రెండూ ఈ ఇద్దరు న్యాయమూర్తుల వద్దకు కాకుండా రోస్టర్‌లో వేరే కేసులను కేటాయించారు. ఈ రోజు జరిగిన విచారణ సమయంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఆయన ఆరోగ్యం గరించి వివరించారు.

రేపు తీర్పు వెల్లడి : హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్లతో పాటుగా చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను న్యాయవాదులు జత చేసారు. చంద్రబాబు ను అరెస్ట్ చేసిన తరువాత ఈ 50 రోజుల్లో కొత్తగా పురోగతి లేదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. అదే సమయంలో కొత్తగా ఆరోపణలు కూడా లేవని వివరించారు.
విచారణకు పూర్తిగా చంద్రబాబు సహకరిస్తారని న్యాయవాదులు కోర్టుకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.అటు సుప్రీంలో క్వాష్ తీర్పు పైన ఆసక్తి నెలకొంది. వచ్చే నెల 8, 9 తేదీల్లో సుప్రీంలో చంద్రబాబుకు సంబంధించిన కీలక తీర్పులు వెలువడే అవకాశం ఉంది. దీంతో, రేపు (మంగళవారం) హైకోర్టు బెయిల్ పైన తీర్పు విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications